04-01-2026 12:00:00 AM
హుజూర్‌నగర్, జనవరి 3(విజయక్రాంతి): హుజూర్‌నగర్ సబ్ జైలు రిమాండ్ ఖైదీ కర్ల రాజేష్ మృతిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశా రు. శనివారం హుజూర్‌నగర్ సబ్ జైల్, ఏరి యా హాస్పిటల్‌ను సందర్శించి అధికారులను పలు వివరాలు అడిగి తెలుకున్నారు.అనంతరం ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో విలేకరుల సమావేశంలో మంద కృష్ణ మాట్లాడుతూ కర్ల రాజేష్ మృతి పలు అనుమానాలకు దారి తీస్తుందన్నారు.
రాజేష్ మృతికి కారణమైన చిలుకూరు ఎస్‌ఐని డిస్మిస్ చేయాలన్నారు. సీఐ, డీఎస్పీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజేష్ రిమాండ్ రిపోర్టు తప్పుల తడకగా ఉందన్నారు. ఎఫ్‌ఐఆర్ కాపీ లో పోలీసుల కుట్రలు ఉన్నాయన్నారు. రాజేష్‌ను చిత్రహింసలు పెట్టి ఎలాగైనా చనిపోయేలా ఉన్నాడన్న తొందరలో కోర్టులో ప్రవేశపెట్టారని తెలిపారు. ఇప్పటికే ఈ కేసును కనుమరుగయ్యేలా చేయాలని పలువురు చూస్తున్నారని, మరింత ప్రజా ఉద్యమంలా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామన్నారు.
ఈనెల 10న కోదాడలో రాజేష్ సంతాపసభ నిర్వహించి రాష్ట్రవ్యాప్తంగా దళిత సంఘాలు, సామాజిక న్యాయం కోరే ప్రజాసంఘాలతో తమ పోరాటం ఉధృతం చేస్తామన్నారు. ఈ కేసులో రెడ్డి సామాజిక తరగతికి చెందిన ఎస్‌ఐపై చర్యలు తీసుకోకుండా ఎస్పీ ఆఫీస్‌కి అటాచ్ చేశారన్నారు. అలాగే బీసీ తరగతికి చెందిన రూరల్ సీఐ ప్రతాప్ లింగంపై సస్పెన్షన్ వేటు వేయడం అన్యాయమన్నారు.
పోలీ స్ శాఖ పట్ల తమకు పూర్తి నమ్మకం ఉందని డీజీపీ ఒక కమిటీని ఏర్పాటు చేసి సమగ్ర దర్యాప్తును చేయాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు బచ్చలకూరి వెంకటేశ్వర్లు మాదిగ,ప్రసాద్ మాదిగ, చింతిరాల నాగయ్య మాదిగ, ఎంజేఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఓగ్గు విశాఖ మాదిగ,మంద నాగరాజు మాదిగ, మీసాల శరత్ మాదిగ, వెంకటేశ్వర్లు మాదిగ,తదితరులు పాల్గొన్నారు.