28-05-2025 06:44:11 PM
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి..
హనుమకొండ (విజయక్రాంతి): పశ్చిమ విద్యా సిగలో మరో మైలురాయి దాటిందని, ఈ మహత్తర ఘట్టానికి 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఏర్పాటుకు జీఓ జారీ చేసిన సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలకి జిల్లా, నియోజకవర్గ ప్రజల పక్షాన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(MLA Naini Rajender Reddy) ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం విద్య హబ్ గా మారనున్నదని, రాష్ట్ర వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాలకు విద్య అందించేందుకు 4000 కోట్లతో 20 కొత్త ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. హనుమకొండ చరిత్రలో ఇది సువర్ణ అధ్యాయం అని పేర్కొన్నారు.
గతంలో జరగని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రజాప్రభుత్వంలో జరుగుతున్నాయని మెడికల్ హబ్, ఎడ్యుకేషన్ హబ్, ఆధ్యాత్మిక నగరంగా అభివృద్ధి చెందుతున్నదని చరిత్రలో ఎన్నడూ జరగని భద్రఖాళి అమ్మవారి మాడవీధులు, చెరువు ప్రక్షాళన పనులు జరుగుతున్నాయని అన్నారు. నిన్న ఒక్కరోజే పశ్చిమ నియోజవర్గానికి మరో రెండు కీలక అభివృద్ధి జీఓ లను ప్రభుత్వం మంజూరు చేసిందని రానున్న రోజుల్లో మీడియా ముందుకు తీసుకువస్తానని అన్నారు. గతంలో మీ హయాంలో రహదారి చిరు వ్యాపారుల కోసం షట్టర్ ఏర్పాటు చేసి కేవలం మీ బినామీలకు ఇచ్చుకున్నది వాస్తవం కదా అని ప్రశ్నించారు.
రోడ్డు వెడల్పు కార్యక్రమంలో నష్టపోతున్న చిరు వ్యాపారాలకు వెజ్ అండ్ నాన్వెజ్ కాంప్లెక్స్ లో అవకాశాలు కల్పిస్తానని మీడియా ముఖంగా భరోసా కల్పించారు. అనంతరం స్థానిక నేతలతో కలసి సీఎం ఏనుముల రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశంలో పీసీసీ సభ్యులు ఈ.వి. శ్రీనివాస్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజిజ్ ఖాన్, మునిసిపల్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, జిల్లా మహిళా అధ్యక్షులు బంక సరళ యాదవ్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు రామకృష్ణ, బ్లాక్ అధ్యక్షులు లక్ష్మా రెడ్డి, సంపత్ యాదవ్, అంబేద్కర్ రాజు, కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.