calender_icon.png 24 November, 2025 | 4:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమ్మకు మరోపేరు అమృతం

22-11-2025 12:00:00 AM

ఆచార్య మసన చెన్నప్ప :

మా నాన్నగారు అస్వస్థులు కావడం వల్ల మాటి మాటికి కొల్కులపల్లికి వెళ్లి వచ్చేవాణ్ణి. నా పిహెచ్.డి. సిద్ధాంత గ్రంథం ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సమర్పించే దాకా మా నాన్నగారు బ్రతకాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించేవాణ్ణి. అది 1988వ సంవత్స రం, ఏప్రిల్ మాసం. నాన్నగారు పోయారన్న వార్త వచ్చింది. వార్త విన్న రోజే సిద్ధాంత గ్రంథాన్ని విశ్వవిద్యాలయంలో సమర్పించి ఊరికి వెళ్లిపోయాను. కోరికలు మానవులవి.

వాటిని తీర్చేవాడు భగవంతుడే. స్తుతిగాని, ప్రార్థనగాని భగవంతునికే చెందాలని వేదం ఉపదేశిస్తుంది. నాన్న దివంగతుడైన తర్వాత మా అమ్మ నా దగ్గ రే ఉంటుంది. అప్పటికి నాన్న పోయి ఒక సంవత్సరం కావొచ్చు. ఆమె ఒకరోజు ఆయాసపడుతూ ‘నేను వారం రోజులు మాత్రమే బ్రతుకుతాను’ అని గద్గదస్వరంతో పలికింది. ఆయాసపడుతుంది కదా అని ఎం.బి.బి.ఎస్ డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్లాను. ఆ డాక్టర్ ఇచ్చిన మందులు నాల్గురోజులు వాడిన తర్వాత ఒకరోజు స్నానానంతరం నేలమీద వాలిపోయింది.

‘నేను అమ్మా! అమ్మా!’ అని అరిచాను. కానీ ఆమెకు వినిపించలేదు. అప్పుడు నా ఇంటి పక్కనే ఉన్న ఆర్.ఎం.పి డాక్టర్ ఆంజనేయులు గారి దగ్గరకు వెళ్లి తీసుకొనివ చ్చాను. ‘మాటలు రావడం లేదు. కళ్లు తెరి చి చూడడం లేదు. మా అమ్మ బ్రతికే ఉం దా డాక్టర్’ అని అడుగుతుండగానే ఆంజనేయులు అమ్మ చేతిని తన చేతిలోకి తీసు కొని నాడి చూశాడు.

అమ్మ బ్రతికే ఉందా?

‘అమ్మ బ్రతికే ఉంది. గాభరా పడకండి. రాంనగర్‌లో నాకు తెలిసిన చిన్న హాస్పిట ల్ ఉంది. అక్కడికి తీసుకొని వెళ్దాం’ అని తాను కూడా హాస్పిటల్‌కు రాగా అమ్మను తీసుకొని వెళ్లాను. కళ్లు తెరిచి చూడనప్పు డు, నోట మాట రానప్పుడు, కాళ్లు, చేతు లు కదలించనప్పుడు ఎవరైనా చనిపోయారనే భావిస్తారు. నేను నిజంగా అలాగే అనుకున్నాను. కానీ నాకు అందుబాటులో ఉన్న ఆంజనేయులుగారు ఎం.బి.బి.ఎస్ డాక్టర్ కాకపోయినా, వెంటనే వచ్చి నాడి చూసి బ్రతికి ఉందని తెలియజేయడం ఆశ్చర్యాన్ని కల్గించింది.

ఆర్.ఎం.పి. డాక్టరైనప్పటికీ వెంటనే ఫస్ట్ ఎయిడ్‌లా ఉపయో గపడే ఆంజనేయులు నాకెన్నోసార్లు సాయపడినాడు. మా అమ్మాయి శ్రావణికి కంటి దగ్గర గాయమైనప్పుడు ఆంజనేయు లు గారే రక్తం స్రవించకుండా రెండు కుట్లు వేసి మాకు ధైర్యం ఇచ్చాడు. మా క్రాంతికి స్కూటర్ కారణంగా చేతికి దెబ్బతగిలినప్పుడు ఒక మిలట్రీ డాక్టర్ దగ్గరకు తీసు కొని వెళ్లి బాగు చేయించింది ఆయనే. 

ఇడ్లీ తినాలని ఉంది!

రాంనగర్ నుంచి ఆంధ్ర మహిళాసభ హాస్పిటల్‌కు ఆంజనేయులు సలహా మేరకే అమ్మను తీసుకొని రావడం జరిగింది. కృత్రిమంగా ఆక్సిజన్ అందించడం వల్ల అమ్మ నాలుగు రోజులే బ్రతికింది. ఆ నాలుగు రోజులు నాతో చక్కగా మాట్లాడింది. ఒకరోజు ముందు ‘నాన్నా నాకు ఇడ్లీ తినాలని ఉంది. ప్రమీలతో చేయించుకొని తీసుకొని రా!’ అని కోరింది. అమ్మకు తోడుగా చిన్నక్క లక్ష్మమ్మ ఉండడం వల్ల నాకు పెద్దగా ఇబ్బంది కలగలేదు.

మర్నా డు ఉదయం ఆరు గంటలకే అమ్మ దగ్గర ఇడ్లీతో ప్రత్యక్షమయ్యాను. అమ్మ నాకోస మే ఎదురుచూస్తున్నట్లు అక్క చెప్పింది. ‘నాన్నా నాకు పాలు తాగిస్తావా?’ అని కోరింది. కొన్ని పాలు నోటిలో పోయగానే నవ్వుతూ కన్నుమూసింది. అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయా రు. ‘రాత్రి మీ అమ్మ ప్రాణాలు పోకుండా నీకోసమే ఆగినట్లు ఉంది. పాలు పోయగానే పరలోకానికి పరిగెత్తింది.’ అని హాస్పిటల్లో అమ్మ పక్కన బెడ్ మీద ఉన్న ఆవిడ పలుకుతుంటే నాకు ఏడ్పు ఆగలేదు.

మా అమ్మకు నేను చిన్న కొడుకును. ఐదేళ్ల దాకా నాకు స్తన్యమిచ్చినట్లు అక్కలు చెప్పేవారు. అమ్మ చంక నెక్కకుండా ఉండేవాణ్ణి కాదట! ఎక్కడికి వెళ్లినా అమ్మ వెంట వెళ్లేవాడినట. కొద్దిగా పెద్దగైన తర్వాత అమ్మతో మిరపతోట లేరడానికి, గుట్టలకు కట్టెలు తేవడానికి వెళ్లేవా డిని. అమ్మ నేను చిన్న కుమారుణ్ణి కదా అని చిరుదిండ్లు దాచిపెట్టేది.

పెళ్లిళ్లకు, పేరంటాలకు ఆమె వెంట తీసుకొని వెళ్లడ మే గాక, జాతరలకు ఎవరితోనైనా పంపించేది. ఎన్నోమైళ్ల దూరం అమ్మ నన్ను భుజాలమీద ఎత్తుకొని వెళ్లిన రోజులున్నా యి. బాల్యంలో అమ్మ ప్రేమను అపారం గా పొందినవాణ్ణి. చింతపల్లిలో ఆరు నుం చి పది వరకు చదివినంతకాలం వారం వారం తోడుగా నా వెంట రెండుమైళ్లు నడిచి నన్ను బస్సెక్కించేది మా అమ్మ.

మృత్యువు నుంచి బయటపడ్డాం..

ఒకసారి హైస్కూల్‌లో ఉన్నప్పుడు ఒక వారం నేను ఊరికి రాలేదు. ఎందుకు రాలేదో? అని మా అమ్మ ఎర్ర బస్సెక్కి మా ఊరికి పదిమైళ్ల దూరంలోని చింతపల్లికి వచ్చింది. కిరాయి ఇంట్లో రెండు రోజులుండి నాకు స్వయంగా అన్నం వండిపెట్టింది. తిరిగి ఊరికి వెళ్లినప్పుడు భారీ వర్షంలో బస్సులో నుంచి ఎక్కడ దిగాలో తెలియక, ఊరి బస్టాండుకు ముందు ఒకమైలు దూరంలో దిగిపడ్డ అవస్థలు మాటలతో చెప్పలేను. ఆరోజు నిజంగా మృత్యువు నుంచి బయటపడ్డాం. ‘నువ్వు కొడుకు కోసం ఎంతో కష్టపడుతున్నావు. పెద్ద చదువు చదువుకొని నీకు అన్నం పెడుతాడులే’ అని ఎవరైనా అంటే, అట్లే కానియ్యమని ఆ భగవంతుణ్ణి వేడుకునేది మా అమ్మ రామ లక్ష్మమ్మ. 

మొదట అమ్మ.. తర్వాతే మోక్షం!

అమ్మ నన్ను ఎప్పుడూ కొట్టినట్లుగా దాఖలాలైతే లేవు. ఎవరైనా నన్ను కొడితే, తానేడ్చేది. ఎవరైనా నన్ను ప్రేమతో చూస్తే వారిని గౌరవించేది. ఆధ్యాత్మిక రచనలు చేస్తూ, ఉపనిషత్తుల మీద ఉపన్యసిస్తున్న నన్ను ‘మీకు మోక్షం కావాలా? అమ్మ కావాలా?’ అని అడిగారొకరు. నేను వెంటనే వారికి ‘మొదట అమ్మ, ఆ తర్వాతనే మోక్షం’అని సమాధానమిచ్చా ను. త్రాసులో ఒకవైపు అమ్మనూ, మరొక వైపు సమస్త దేవతలను ఉంచి, నిన్ను ఏవైపు ఉంటావని సి. నారాయణరెడ్డి గారినడిగితే వారు ‘అమ్మవైపే’ అని సమాధాన మిచ్చారట!. ఆ మహాకవి శిష్యుడనైనా నేనూ తక్కువేమీ కాదుకదా!. వారికి అమ్మ అంటే ఎంత ప్రాణమో నాకూ అంతే.

‘అమ్మకు మరోపేరు అమృతం!

అవనిపై పిల్లలకు అమృతం త్రాగించాలని దివి నుంచి భువికి దిగిన దేవత అమ్మ’.

 వ్యాసకర్త సెల్: 9885654381