22-11-2025 12:00:00 AM
విశ్వవేదికపై తెలంగాణ క్రీడాకారులు తమ సత్తా చాటుతున్నారు. మొన్న మహిళల వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యురాలైన అరుంధతి రెడ్డి కావొచ్చు.. నిన్న డెఫిలింపిక్స్‌లో స్వర్ణాలు సాధించిన హైదరాబాదీ షూటర్ ధనుశ్ శ్రీకాంత్ కావొచ్చు.. ప్రపంచకప్ బాక్సింగ్ లో పసిడి నెగ్గిన నిజామాబాద్ ముద్దుబిడ్డ, బాక్సర్ నిఖత్ జరీన్.. ఇలా ఎవరైనా సరే అంతర్జాతీయ క్రీడా వేదికపై తమ ఆటతీరుతో అదరగొడుతున్నారు.
గురువారంతో ముగిసిన ప్రపంచకప్ బాక్సింగ్‌లో భారత బాక్సర్లు మొత్తం 20 పతకాలు సాధించగా.. తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ తన పంచ్ పవర్ రుచి చూపించి దాదాపు రెండేళ్ల తర్వాత స్వర్ణ పతకాన్ని కొల్లగొట్టింది. గతేడాది పారిస్ ఒలింపిక్స్‌లో పతకం సాధించడంలో విఫలమైన నిఖత్ ఆ తర్వాత జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్‌లోనూ క్వార్టర్స్‌లోనే వెనుదిరిగి నిరాశ పరిచింది.
గత రెండేళ్లలో పతకం సాధించ డంలో విఫలమైన నిఖత్ తనకు అచ్చొచ్చిన ప్రపంచ బాక్సింగ్ కప్‌లోనే వరుస నాకౌట్ విజయాలతో ఫైనల్‌కు చేరుకుంది. ఫైనల్లో కూడా ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశమివ్వని నిఖత్ తన జోరును కనబరిచి పసిడి సొంతం చేసుకుంది. 2022లో స్టాంజా వేదికగా జరిగిన ఇదే ప్రపంచకప్ బాక్సింగ్‌లోనూ నిఖత్ జరీన్ స్వర్ణం కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. భుజం గాయానికి తోడు వరుస వైఫల్యాలు నిఖత్ జరీన్ కెరీర్‌ను ఇబ్బందుల్లో పడేశాయి.
ఈ నేపథ్యంలో తాజా విజయం తనకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చినట్లయిందని, రాబోయే రెండేళ్లలో కామన్‌వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్ జరగనున్న నేపథ్యంలో తన పంచ్ పవర్‌తో మరిన్ని పతకాలు సాధిస్తానని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది. ఇక పుట్టుకతోనే వినికిడి సమస్యతో జన్మించినప్పటికీ ప్రతిభకు కాదేదీ అనర్హం అన్నట్లు ధనుశ్ శ్రీకాంత్ తన ఆటతీరుతో అదరగొడుతున్నాడు. ప్రతిభకు వైకల్యం అడ్డుకాదని నిరూపిస్తూ ధనుశ్ షూటింగ్‌లో దేశ ప్రతిష్టను ఇనమడింపజేస్తున్నాడు.
తాజాగా టోక్యో డెఫిలింపిక్స్ 2025లో ధనుశ్ శ్రీకాంత్ మిక్స్‌డ్ 10 మీటర్ల రైఫిల్, పురుషుల 10 మీటర్ల రైఫిల్ విభాగంలో స్వర్ణ పతకాలు సాధించి ఔరా అనిపించాడు. లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత గగన్ నారంగ్ శిష్యుడైన ధనుశ్ శ్రీకాంత్ గురువుకు తగ్గట్లే 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో పతకాల పంట పండిస్తున్నాడు. కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు వేర్వేరు అంతర్జాతీయ స్థాయి టోర్నీల్లో 13 పత కాలు సాధించడం గమనార్హం.
గతేడాది జర్మనీ వేదికగా జరిగిన ప్రపంచ డెఫ్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో రెండు స్వర్ణాలు సాధించడంతో ధనుశ్ ప్రతిభ వెలుగులోకి వచ్చింది. భారత మహిళా క్రికెటర్ అరుంధతీరెడ్డి విషయానికొస్తే.. వికెట్ కీపర్ కావాల్సిన ఆమె ఇవాళ పేస్ బౌలర్‌గా మారి తక్కువ ఎకానమీతో ఎక్కువ వికెట్లు సాధించగల నైపుణ్యాన్ని సొంతం చేసుకుంది. రైల్వేస్ జట్టును వదిలేసి కేరళ జట్టుకు మారిన అరుంధతీకి కోచ్ బిజూ జార్జ్‌తో పరిచయం తన ఆటను పూర్తిగా మార్చేసింది.
ఆయన శిక్షణలో మరింత రాటుదేలిన అరుంధతీ ఇవాళ భారత పేస్ బౌలింగ్ దళంలో కీలకంగా మారిపోయింది. అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న తెలంగాణ క్రీడాకారులకు ఆర్థికంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలిస్తే భవిష్యత్తులో దేశానికి మరిన్ని పతకాలు తీసుకొచ్చే అవకాశముంది.