calender_icon.png 23 August, 2025 | 1:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫాల్కన్ కేసులో మరొకరు అరెస్ట్

22-08-2025 02:03:25 AM

  1. చార్టర్డ్ అకౌంటెంట్‌ను అదుపులోకి తీసుకున్న ఈడీ

నిందితుడు శరద్ చంద్ర తోష్నివాల్కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్

హైదరాబాద్, సిటీ బ్యూరో ఆగస్టు 21 (విజయక్రాంతి): అమాయక మదుపరుల నుంచి వందల కోట్లు కొల్లగొట్టిన ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ స్కీమ్ కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో కీలక పాత్ర పోషించాడనే ఆరోపణలపై చార్టర్డ్ అకౌంటెంట్ శరద్ చంద్ర తోష్నివాల్ను హైదరాబాద్ ఈడీ అధికారులు అరెస్టు చేశారు.

నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. వివరాల్లోకి వెళితే.. క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ, దాని నిర్వాహకులు అమర్దీప్ కుమార్ తదితరులు కలిసి ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ స్కీమ్ పేరుతో ఓ పథకాన్ని ప్రారంభించారు. ఇందులో పెట్టుబడి పెడితే అతి తక్కువ కాలంలోనే అధిక రాబడులు వస్తాయని అమాయక ఇన్వెస్టర్లను నమ్మించి, వారి నుంచి భారీగా డబ్బు వసూలు చేశారు.

ఈ మోసంపై కేసు నమోదు చేసిన ఈడీ, మనీలాండరింగ్ నిరోధక చట్టం , 2002 కింద దర్యాప్తు చేస్తోంది. ఈ కుంభకోణంలో జరిగిన ఆర్థిక లావాదేవీల్లో చార్టర్డ్ అకౌంటెంట్ అయిన శరద్ చంద్ర తోష్నివాల్ కీలక పాత్ర పోషించినట్లు ఈడీ అధికారులు తమ దర్యాప్తులో గుర్తించారు. ఈ నేపథ్యంలో బుధవారం అతడిని అరెస్టు చేశారు. అనంతరం పీఎంఎల్‌ఏ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని ఈడీ వర్గాలు సూచిస్తున్నాయి.