25-01-2025 12:00:00 AM
వయస్సు శరీరానికే కానీ మనసుకు కాదు అని చాటి చెబుతోంది 70 ఏళ్ల టమాటా రామానుజమ్మ. లేటు వయసులోనూ చిరుత లాంటి పరుగు, నిండైన ఆత్మవిశ్వాసంతో జాతీయ, అంతర్జాతీయ వేదికలపై పతకాల మీద పతకాలు సాధిస్తోంది. 50 ఏళ్లకే రిటైర్ అయ్యే కాలంలో తగ్గేదేలే అంటూ ట్రాక్‌పై దూసుకుపోతోంది. మలేషియా అయినా, మణిపూర్ అయినా పోటీ ఎక్కడైనా విజయమే లక్ష్యంగా రాణిస్తోంది. తాజాగా ఆసియా మాస్టర్ అథ్లెటిక్ ఓపెన్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించింది. తన పరుగు ప్రస్థానం ఎలా మొదలైంది? ఆమె ఆరోగ్య రహస్యం ఏమిటి? లాంటి విషయాలను విజయక్రాంతితో వివరించారిలా..
నా పేరు టమాటా రామానుజమ్మ. సిరిసిల్ల టౌన్. మావారు భాషయ్య హెల్త్ సూపర్ వైజర్. చిన్నప్పట్నుంచే ఆటలంటే చాలా ఇష్టం. ఆరోజుల్లో ‘చాంపియన్’ అంటే ఏమిటో కూడా తెలియదు. కానీ ఎన్నో పతకాలు సాధిం చా. స్కిప్పింగ్, టెన్నికాయిట్, కరాటే.. ఇలా ఆట ఏదైనా సరే పోటీ పడి మరీ పతకాలు గెలిచేదాన్ని.
చదువులో నాకంటే రాణించేవాళ్లు ఎంతోమంది ఉన్నా.. ఆటల్లో మాత్రం నాతో పోటీ పడేవారు చాలా తక్కువ. అందుకు కారణం నా ఆత్మవిశ్వాసమే. 1990 నుంచి ఆటలు ఆడుకుంటూ వస్తున్నా. అంటే 45 ఏళ్ల వయసులో రన్నింగ్ చేయడం మొదలుపెట్టా. నా స్నేహితురాలు షీలా ఇచ్చిన సలహాతో జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటున్నా.
ఆగని పరుగు
మొదటిసారి 1996లో కరీంనగర్‌లో రాష్ట్ర స్థాయిలో పోటీ ల్లో స్వర్ణం సాధిం చా. 1997లో కొత్తగూడెంలో ఏపీ వెటరన్ ఆమెచ్యూర్ అథ్లెటిక్స్ రజతం, 1998, 1999లో వరుసగా బంగారు పతకాలు సాధించా. 2004 హైదరాబాద్‌లో జరిగిన జాతీయ పోటీల్లో (100, 200 మీటర్లు) రెండుసార్లు ప్రథమ స్థానంలో నిలిచా. 2007లో వరంగల్, 2012లో విశాఖపట్నంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో మొదటి బహుమతులు సాధించా.
ఏడుపదుల వయస్సులో ఇప్పటివరకు పరుగుపందెం, జావలింగ్ త్రో ఆటల్లో మొత్తం 65 బంగారు పతకాలు, 52 వెండి పథకాలు, ప్రశంసాపత్రాలు, నగదు పుర స్కారాలు అందుకున్నా. భారత్ మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల అయోధ్యలో జరిగిన 70 ఏళ్ల విభాగంలో 1500 మీటర్లు, 800 మీటర్లు పరుగు పందెంలో రెండు మెడల్స్ సాధించా. తాజాగా మంగళూరులో జరిగిన సౌత్ ఆసియా మాస్టర్ అథ్లెటిక్ ఓపెన్ చాంపియన్‌షిప్ పోటీల్లో (800 మీటర్లు) కాంస్యం సాధించా.
తెలంగాణ మహిళగా..
అంతర్జాతీయ పోటీలు అంటేనే చాలామంది భయపడిపోతారు. నాలాంటి ఎంతోమంది పోటీ పడుతుంటారు. కానీ నేను ఎక్కడ పోటీ జరిగినా ఆత్మవిశ్వాసంతో వెళ్లేదాన్ని. అలా మలేషియాలో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో 100, 200 మీటర్ల పరుగు పందెంలో తృతీయ స్థానంలో నిలిచి మొదటిసారి మనదేశ జెండా ఎగురవేశా. అయితే ఇప్పటివరకు తెలంగాణలో లెక్కకుమించి పతకాలు సాధించిన మహిళలు చాలా తక్కువ.
ఈ వరుసలో నేనే ముందుంటా. ఆటలే కాదు సామాజిక సేవ నాకు చాలా ఇష్టం. కేదార్‌నాథ్, బద్రీనాథ్, కాశీ లాంటి పుణ్యక్షేత్రాలకు నాలాంటివాళ్లను తీసుకెళ్లి దర్శనం చేయించా. ఆటలు, సామాజిక సేవల రెండింటిలోనూ పాల్గొంటున్నా. అందుకే నేను నిత్య నూతనంగా ఉంటా. 2019లో అప్పటి ప్రభుత్వం దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ‘వయో శ్రేష్ట సమ్మన్’ అవార్డు అందించింది.
ఆరోగ్య రహస్యం
నేను మొదట్నుంచే అలంకరణకు దూరంగా ఉంటా. ఇప్పటివరకు ఒక్క మందుబిళ్ల వేసుకోలేదు. బీపీ, షుగర్ అంటే ఏంటో కూడా తెలియదు. ఉదయం లేవగానే గోరువెచ్చని నీరు తాగుతా. కాసేపు ప్రాణాయామం చేస్తా. రోజులో ఒకసారైనా వాకింగ్ కచ్చితంగా చేస్తా, భుజాలు, మెడలు, మోకాలు ఇలా శరీరంలోని ప్రతిభాగం కదిలేలా వ్యాయామం చేస్తా.
అయితే ఈ రోజుల్లో చాలామంది ‘వ్యాయామం చేయడానికి సరైన సమయం దొరకడం లేదు’ అంటూ సాకులు చెప్తున్నారు. కానీ మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఆనందంగా ఉండాల్సిన వయస్సులో రోగాలు, నొప్పులతో బాధపడుతున్నారు. అందుకే ప్రతిరోజు మానసికొల్లాసానికి ఏదో ఒక వ్యాయామం చేయాలి.