25-01-2025 12:00:00 AM
టెక్నాలజీ మన జీవితంలో చాలా ముఖ్యమైన భాగం. చదువుల నుంచి ఉద్యోగాల వరకు.. వినోదం నుంచి విశ్రాంతి వరకు.. మనం ప్రతిదానికీ డిజిటల్ స్క్రీన్‌లను ఉపయోగిస్తున్నాం. కాని నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మన శరీరం.. మనస్సు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్నిసార్లు వీటికి దూరంగా ఉండటం మంచిదంటున్నారు. సైకాలజిస్టుల ప్రకారం.. మొబైల్స్, ల్యాప్‌టాప్ వంటి గ్యాడ్జెట్స్ అశాంతిని పెంచుతాయి.
అశాంతిని దూరం చేసుకోవడం కోసం డిజిటల్ డిటాక్స్ అవసరం అంటున్నారు నిపుణులు. టెక్నాలజీ ప్రపంచానికి దూరంగా ఉండేందుకు డిజిటల్ సెలవులు తీసుకోవడాన్ని ‘డిజిటల్ డిటాక్స్’ అంటారు. ఇందులో భాగంగా.. మొబైల్, ఇంటర్నెట్‌కు దూరంగా గడపడానికి నిర్ణయం తీసుకుంటారు. డిజిటల్ స్క్రీన్‌లకు దూరంగా ఉండటం అంత సులభం కాదు. కానీ దాని నుంచి విరామం తీసుకోవడం చాలా సులభం.
ఎక్కువ గంటలు స్క్రీన్ వైపు చూసే బదులు, ప్రతి అరగంటకు చిన్న విరామం తీసుకోవాలి. విరామ సమయంలో సాంకేతికతకు దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. అలాగే రాత్రి భోజనం చేసినప్పటి నుంచి ఉదయం నిద్రలేచే వరకు ఫోన్‌ని ఆఫ్‌లో ఉంచండి. ఈ సమయంలో టీవీ కూడా చూడకండి. ఆ సమయాన్ని కుటుంబం, ఇష్టమైన కార్యకలాపాల కోసం కేటాయించుకోండి. స్క్రీన్ సమయాన్ని తగ్గించడానికి ఫోన్ సెట్టింగ్‌లను మార్చండి. సమయాన్ని వృథా చేసే యాప్‌లు లేదా గేమ్‌లను బ్లాక్ చేయండి.