03-11-2025 08:04:28 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 111 దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్ తెలిపారు. ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం లో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలు, అభ్యర్థనలను అధికారులకు తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, మదన్ మోహన్, సీఈవో చందర్, డిప్యూటీ కలెక్టర్ రవితేజ, ఏఓ పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించి సంబంధిత శాఖాధికారులకు అప్పగిస్తూ తక్షణమే పరిష్కరించాలని ఆన్నారు.
ఈ సందర్భంగా అదనపు రెవెన్యూ కలెక్టర్ విక్టర్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ... ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలన్నారు. తహసిల్దార్లు, శాఖాధికారులు ప్రజా సమస్యలను ప్రాధాన్యంగా తీసుకొని తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే పెండింగ్ లో ఉన్న ఆయాశాఖలకు సంబంధించి ప్రజావాణి దరఖాస్తుల పై ఆరా తీస్తూ దరఖాస్తులు పెండింగ్ లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని తెలిపారు. ప్రజావాణి కి 111 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.