calender_icon.png 24 August, 2025 | 1:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వడ్డీ వ్యాపారులపై పోలీసుల కొరడా

23-08-2025 08:36:04 PM

ఏడుగురిపై కేసు నమోదు..

ఏడు కోట్ల విలువైన ప్రామిసరి నోట్లు, బాండ్లు స్వాధీనం..

అర్మూర్ (విజయక్రాంతి): అధిక వడ్డీలు వసూలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఆస్తులు రాయించుకుంటున్న వడ్డీ వ్యాపారులపై అర్మూర్ పోలీసులు కొరడా జులిపించారు. అర్మూర్ పట్టణంతో పాటు అర్మూర్ మండలంలోని సుర్బిర్యాల్ గ్రామానికి చెందిన ఏడుగురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరు ప్రభుత్వము నుండి ఎటువంటి అనుమతి, లైసెన్స్ లేకుండా ప్రజల వద్ద నుండి వస్తువులను తాకట్టు పెట్టుకుని కాళీ ప్రాంసరీ నోట్లపై, కాళీ చెక్కులపై సంతకములు తీసుకొని డబ్బులు అప్పుగా ఇచ్చారు. తిరిగి చెల్లించే సమయంలో వారిని భయపెట్టి బలవంతంగా అధిక వడ్డీ వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో పోలీసులు వడ్డీ వ్యాపారులపై నిఘా పెట్టారు.

ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరు అప్పు కోసం వచ్చిన వారికి డబ్బులు ఇచ్చి తిరిగి చెల్లించే సమయంలో వారికి నచ్చిన వడ్డీ రాసుకొని బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వారి వద్ద నుంచి సుమారు ఏడు కోట్ల రూపాయల విలువ చేసే ప్రామిసరీ నోట్లు, బాండ్లు, చెక్కులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 14 లక్షల నగదును సైతం స్వాధీనం చేసుకున్నారు. వడ్డీ వ్యాపారులపై వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అర్మూర్ సిఐ సత్యనారాయణ తెలిపారు.