23-08-2025 08:32:26 PM
మంత్రి పొన్నం ప్రభాకర్..
హుస్నాబాద్: హుస్నాబాద్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రగామి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అన్నారు. చరిత్ర, పర్యావరణ సౌందర్యాన్ని మేళవించి, ఈ ప్రాంతాన్ని అన్ని వర్గాల ప్రజలకు ఆకర్షణీయంగా మారుస్తామని చెప్పారు. శనివారం ఆయన హుస్నాబాద్‌లోని ఎల్లమ్మ ఆలయం, ఎల్లమ్మ చెరువు వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి, ఆలయ ఈవో కిషన్ రావు, ఇతర అధికారులతో కలిసి పెండింగ్ పనుల పురోగతిపై సమీక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఎల్లమ్మ చెరువు వద్ద జరుగుతున్న రూ. 15 కోట్ల సుందరీకరణ పనులను పరిశీలించారు.
పనులను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్లు, అధికారులను ఆదేశిస్తూ, బతుకమ్మ, దసరా పండుగలలోపు పనులు గణనీయమైన పురోగతి సాధించాలని లక్ష్యం నిర్దేశించారు. చెరువులో వాటర్ బోటింగ్ సదుపాయాలను కల్పించనున్నట్టు తెలిపారు. ఎల్లమ్మ చెరువు కాకతీయుల కాలం నాటి చారిత్రక ప్రాధాన్యాన్ని కలిగి ఉన్నందున, దానిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయం తరహాలో ఎల్లమ్మ ఆలయం ప్రాంగణంలో భక్తులకు భోజనశాల, విశ్రాంతి స్థలాలు ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. హుస్నాబాద్‌ను పర్యాటకంగా అభివృద్ధి చేయడంలో భాగంగా, కప్పుగుట్టను టూరిజం హబ్‌గా మారుస్తామని, ఇక్కడ హరిత హోటల్‌ను నిర్మిస్తామని తెలిపారు.
మహాసముద్రం గండి టూరిజం ప్రాజెక్టు కూడా ప్రణాళికల్లో ఉన్నట్లు చెప్పారు. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా, రోడ్డు డివైడర్ల మధ్య సెంట్రల్ లైటింగ్, ఎల్లమ్మ చెరువు నుంచి మల్లెచెట్టు వరకు డివైడర్‌తో కూడిన డబుల్ రోడ్డు నిర్మాణం, కొత్త చెరువుకు ట్యాంక్ బండ్ ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తామని వివరించారు. పట్టణంలోని జంక్షన్ల అభివృద్ధికి కూడా ప్రణాళికలు చేస్తున్నట్టు చెప్పారు. పట్టణ ఆసుపత్రి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, అది పూర్తి కాగానే పీజీ కాలేజీ ఇక్కడికి వస్తుందని తెలిపారు. ఇంజినీరింగ్ కాలేజీ, ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రాజెక్టు కాలువల నిర్మాణానికి భూములు ఇచ్చి రైతులు సహకరించాలని కోరారు.