14-10-2025 01:29:36 AM
- ఏఐసీసీ పరిశీలకురాలు డాక్టర్ అంజలి నింబాల్కర్
శామీర్ పేట్, అక్టోబర్ 13 (విజయ క్రాంతి): కార్యకర్తల అభిప్రాయం మేరకే డిసిసి అధ్యక్షుడి నియామకం జరుగుతుందని ఏఐసీసీ పరిశీలకురాలు డాక్టర్ అంజలి నింబాల్కర్ అన్నారు. సోమవారం తూముకుంట మున్సిపాలిటీ పరిధిలోని అంతాయిపల్లిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈసారి వినూత్నంగా డిసిసి అధ్యక్షులు నియామకం క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఎంపిక చేస్తారన్నారు. పైనుంచి సీల్డ్ కవర్లో పేరు రావడం వంటివి ఉండబోవన్నారు.
డిసిసి అధ్యక్షుడిని కార్యకర్తల ఎంపిక చేయాలనేది రాహుల్ గాంధీ నిర్ణయమని, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారన్నారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన వారు అయితేనే పార్టీ బలోపేతం మరింత జరుగుతుందన్నారు. అధ్యక్ష పదవికి ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని, కార్యకర్తలు అందరూ తమ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు అన్నారు. నియోజకవర్గాల వారిగా కార్యకర్తల సమావేశాలు నిర్వహించి అభిప్రాయాలు స్వీకరిస్తున్నామన్నారు.
ఈనెల 14న కూకట్పల్లి, 16న కుత్బుల్లాపూర్, 17న మల్కాజిగిరిలో సమావేశాలు ఉంటాయని ఆమె వివరించారు. ఇప్పటివరకు హరి వర్ధన్ రెడ్డి, వజ్రేష్ యాదవ్, శ్రీశైలం గౌడ్, నక్క ప్రభాకర్ గౌడ్, రాపోలు రాములు, మహేందర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి అధ్యక్ష పదవి కోసం దరఖాస్తు చేశారన్నారు. ఈనెల 20వ తేదీ వరకు గడువు ఉన్నందున మరికొన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. కార్యకర్తల అభిప్రాయాలు అధిష్టానానికి పంపుతామని, అధ్యక్షుల పేరు ఏఐసీసీ ప్రకటిస్తుందన్నారు.
పార్టీ కోసం పనిచేసిన వారందరికీ..
పార్టీ కోసం పనిచేసిన వారందరికీ గుర్తింపు లభిస్తుందని ఏఐసీసీ పరిశీలకురాలు డాక్టర్ అంజలి నింబాల్కర్ అన్నారు. అంతయపల్లి శివారులో ఒక ఫంక్షన్ హాల్ లో మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు హరి వర్ధన్ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి వజ్రాష్ యాదవ్, రాష్ర్ట కార్యదర్శి పీసరి మహిపాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహులు యాదవ్, జిల్లాలోని వివిధ మున్సిపాలిటీల అధ్యక్షులు జైపాల్ రెడ్డి, తునికి రమేష్, దోసకాయల వెంకటేష్, వేముల శ్రీనివాసరెడ్డి, సాయి పేట శ్రీనివాస్, గోమారం రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.