05-12-2025 12:00:00 AM
డిప్యూటీ సీఎం భట్టితో రాజస్థాన్ మంత్రి హీరాలాల్ భేటీ
హైదరాబాద్, డిసెంబర్ 4 (విజయక్రాంతి): సింగరేణి సంస్థతో కలిసి రాజస్థాన్ రాజ్య విద్యుత్ ఉత్పాదన్ నిగం లిమిటెడ్ 2,300 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ల (1500 మెగావాట్ల సోలార్, 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ల) నిర్మాణానికి రాజస్థాన్ ప్రభుత్వ క్యాబినెట్ ఇటీవల ఆమోదం తెలిపిందని ఆ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి హీరాలాల్ నగర్ పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను హీరాలాల్ నగర్ కలిసి ఈ మేరకు ఒక లేఖను అందించి, ఉమ్మడి విద్యుత్ ప్రాజెక్టులపై చర్చించారు.
సింగరేణి కంపెనీ లిమిటెడ్‌తో కలిసి తమ రాష్ర్ట విద్యుత్ ఉత్పాదన్ నిగం లిమిటెడ్ ఒప్పందం కుదుర్చుకున్నామని, దీనికి తమ క్యాబినెట్ అనుమతి మంజూరు చేసిందని తెలిపారు. సింగరేణి వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా తొలిసారిగా రాజస్థాన్‌తో ఒప్పందం కుదుర్చుకుందన్నారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్ కాలూరామ్, ప్రమోద్‌శర్మ, సింగరేణి ఈడీ చిరంజీవి, జీఎం శ్రీనివాస్ పాల్గొన్నారు.