02-09-2025 12:00:07 AM
యూరియా కొరతపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం
డీసీసీ అధ్యక్షులు, దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): బీసీల 42 శాతం రిజర్వేషన్ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందడం చారిత్రాత్మకమని, డీసీసీ అధ్యక్షులు, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో కులగణన చేపట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. దాని ప్రకారం అసెంబ్లీ సమావేశాల్లో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల బిల్లును పాస్ చేయించడం జరిగిందన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందడంపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రివర్గానికి, టీపీసీసీ అధ్యక్షులుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం.
ఈనెల 3వ తేదీన మూసాపేట మండలానికి సీఎం రేవంత్ రెడ్డి రానున్నట్లు తెలిపారు. వేముల శివారులోని ఎస్ జిడి ఫార్మా వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన రెండో యూనిట్ న్ ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేయనున్నట్లు వెల్లడించారు. యూరియా కొరతపై బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు తమ స్వార్థ రాజకీయాల కోసం ప్రజాప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. యూరియా కోసం రైతులు ఎవరూ ఆంధ్రాశన చెందవద్దని కోరారు అధికారులు ఎప్పటికప్పుడూ పర్యవేక్షణ చేస్తున్నారని, ఎరువుల కొరత లేకుండా చూస్తామని అన్నారు. టీపీసీసీ ఉపాధ్యక్షులు వేణుగౌడ్ మాట్లాడుతూ కామారెడ్డి డిక్లెరేషన్లో రాహుల్ గాంధీ ప్రకటించిన విదంగా రాష్ట్రంలో సీఎం నేతృత్వంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు తెలిపారు.
టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్ మాట్లాడుతూ... బీసీల సంక్షేమాన్ని ఆలోచించేది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. బీసీల 42 శాతం రిజర్వేషన్ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందడం సంతోషంగా ఉందన్నారు. సమావేశంలో టీజీఎంఎస్సీ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, ముడా చైర్మన్ లక్ష్మణాయాదవ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రామారావు. మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కరి అనిత, నాయకులు ఎస్పీ వెంకటేశ్, ఆనంద్ గౌడ్, సీజే బెనహర్, గంజి అంజనేయులు, అరవింద్ రెడ్డి సాయిబాబా, పయాజ్, అజమత్ అలీ తదితరులు పాల్గొన్నారు.
పాలమూరులో కాంగ్రెస్ నాయకుల సంబరాలు
బీసీల 42 శాతం రిజర్వేషన్ బిల్లు అసెంబ్లీలో పాస్ కావడంపై సోమవారం జిల్లా కేంద్రంలో డీసీసీ అధ్యక్షులు, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. స్థానిక న్యూటౌన్ లోని మల్లికార్జున్ చౌరస్తాలో బాణాసంచా కాల్చి, స్వీట్లు తినిపించుకున్నారు. ప్లకార్డులను ప్రదర్శించారు.