calender_icon.png 2 September, 2025 | 5:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీబీఐ విచారణ అంటే భయం ఎందుకు?

02-09-2025 12:03:52 AM

  1. కేసీఆర్ కుటుంబంలో మూడు ముక్కలాట ఫైనల్‌కు చేరింది 
  2. కాళేశ్వరం అవినీతిలో మామ, అల్లుడి వాటా ఎంతో తేలాలి?
  3. పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ 

హైదరాబాద్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి) : కేసీఆర్ కుటుంబంలో మూడు ముక్కలాట ఫైనల్‌కు చేరిందని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో తప్పు చేసింది కేసీఆరా..? లేదా హరీశ్‌రావా అనేది తమకు అవసరం లేదని, వారి హయంలో కుంభకోణం జరిగిందనేది వాస్తవమని, ఇప్పుడు  ఎమ్మెల్సీ కవిత కూడా అదే విషయం చెప్పిందని సోమవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిలో మామ, అల్లుడు  వాటా ఎంత..? అనేది తేలాల్సి ఉందన్నారు. కేసీఆర్ కుటుంబలో ఉన్న కలహాలను కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వంపై రుద్దడం సరికాదని  హితవు పలికారు. కాళేశ్వం ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి తప్పు చేయలేదంటున్న బీఆర్‌ఎస్ నేతలు సీబీఐ విచారణ అనగానే ఎందుకు జంకుతున్నారని మహేష్‌కుమార్‌గౌడ్ ప్రశ్నించారు. తప్పు చేయకపోతే విచారణ ఎదుర్కోవాలని సూచించారు. 

మొదట కేటీఆర్, ఆ తర్వాత కవిత అమెరికా పర్యటనకు వెళ్లి అవగాహన కుదుర్చుకొని అంతర్గత కలహాలతో హరీశ్‌రావును టార్గెట్ చేశారని ఆయన తెలిపారు. కేసీఆర్ కుటుంబ కలహాలతో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని, బీఆర్‌ఎస్ అవినీతిని బయటపెట్టడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు.

కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయని గతంలో చెప్పిన కవిత ఆ దెయ్యాలు హరీశ్‌రావు, సంతోష్‌రావేనా..? ఇంకా ఎవరైనా ఉన్నారా..? అనే విషయాన్ని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరంపై కవిత మాట్లాడిన మాటలు నిజమా..? అసెంబ్లీలో హరీష్‌రావు మాటలు నిజమా..? అని వారు స్పస్టం చేయాలన్నారు.