11-07-2025 12:31:30 AM
హైదరాబాద్, జూలై 10 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీలో వరంగల్ నేతల పంచాయితీ హాట్ టాపిక్‌గా మారింది. మంత్రి కొండా సురేఖ దంపతులు, ఉమ్మడి జిల్లాకు చెందిన కొందరు ఎమ్మె ల్యేల మధ్య నడుస్తున్న విభేదాలు మరింత ముదురుతున్నాయి. పీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకోవడమే కాకుండా.. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసుకుంటున్నారు.
గురువారం పీసీసీ క్రమశిక్షణ కమి టీ చైర్మన్ మల్లు రవి ముందు వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, నాగరాజు, నాయిని రాజేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య తదితరులు హాజరయ్యారు. తమపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొండా మురళిపై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. ‘మీకు మేం ముఖ్యమా? లేక కొండా ఫ్యామిలీనా? తేల్చుకోవాలి’ అని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.
‘క్రమ శిక్షణ కమిటీ ముందు కు రావాలంటేనే అవమానకరంగా ఉంది. తిట్లు తిన్నది మేము.. కమిటీ కూడా మమ్ముల్నే పిలవడంతో ఎలాంటి సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నారు. కొండా మురళిపై చర్యలు తీసుకోవాల్సిందే. లేదంటే మాకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి’ అని పీసీసీ క్రమశిక్షణ కమిటీకి తేల్చి చెప్పారు. కమిటీ చైర్మన్ మల్లు రవి తమని పిలిచి ఎక్కువ చేస్తున్నారని అన్నట్లు తెలిసింది.
ఇదే అంశంపై పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి మాట్లాడుతూ వరంగల్ కాంగ్రెస్ నేతల పంచాయితీలపై రెండు గంటల పాటు చర్చించామని తెలిపారు. ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు వారి అభిప్రాయాలు చెప్పారని, ఆ జిల్లా నేతలతో మరోసారి సమావేశం అవుతామని పేర్కొన్నారు. ఎమ్మె ల్యేల అభిప్రాయాల మేర కు ఏం చేయాలనేది త్వరలోనే చెబుతామన్నారు. మరోసారి భేటీ ఎప్పుడనేది సమాచారం ఇస్తా మని ఆయన తెలిపారు.