calender_icon.png 14 September, 2025 | 9:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తొలి అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య

15-08-2024 12:00:00 AM

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో సబ్బండ వర్గాలు, వర్ణాలు అందరూ పాల్గొన్నారు. ఆత్మబలిదానాలు కావించుకున్నారు. ‘కానిస్టేబుల్ ముదిరాజ్ ఒక్కడు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగి’ అన్నది గమనార్హం. జేఏసీల ద్వారా సకలజనుల సమ్మె, సాగరహారం లాంటి చారిత్రాత్మక పోరాటాలలో ఉద్యోగులు పోషించిన పాత్ర కొనియాడదగింది. కానీ, ప్రాణాలిచ్చిన ఉద్యోగి మాత్రం కిష్టయ్యనే. ఈ విషయాన్ని ఉద్యోగ సంఘాల బాధ్యులు సముచిత రీతిలో గుర్తించి, ఆయనకు నివాళులు అర్పించాలి. ఇప్పటికైనా ఉద్యమ చరిత్రకారులు వాస్తవాల ఆధారంగా భవిష్యత్ తరాల వారికి అమరుల గురించి వివరించాలి.

దశాబ్దాల తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో 1969 నాటి తొలి ఉద్యమం నుండి నేటివరకు అనేకమంది పాల్గొన్నారు. ఆ పోరాటయోధులకు జేజే లు. అనేకమంది అమరులయ్యారు. అమరులకు ఉద్యమ జోహార్లు. 369 మంది ఆనాటి ప్రభుత్వ అణచివేతలో నేలకొరిగారు. మలిదశ పోరాటంలో శాంతియుత పద్ధతిలో జరిగిన ఉద్యమంలో అనేకమంది ఆత్మార్పణ చేసుకున్నారు. వీళ్ళంతా త్యాగధనులే.

2009 నవంబర్ 29 నుండి ఆమరణ నిరాహారదీక్షకు పూనుకున్న ఉద్యమ సారధి కేసీఆర్ ‘తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చు డో’ అని నినదించారు. ఆంధ్ర పాలకులు తమ న్యాయమైన ఆకాంక్షను నెరవేర్చడం లో అవలంభిస్తున్న వైఖరికి నిరసనగా అనేకమంది ఉద్యమంలోకి ఉరికొచ్చారు. కేసీ ఆర్ దీక్ష రోజు నవంబర్ 29న ఇంజినీరింగ్ విద్యార్థి శ్రీకాంతాచారి ఎల్‌బీ నగర్ చౌరస్తాలో అందరూ చూస్తుండగానే ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకొని ఆత్మాహుతికి పాల్పడ్డాడు. 70 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేర్చగా, 3 డిసెంబర్ 2009న తెలంగాణ రాష్ట్రం కోసం కలవరిస్తూ కన్ను మూశాడు. అంతకు రెండు రోజుల క్రితం డిసెంబర్ 1 నాడు పోలీస్ కిష్టయ్య ఆత్మార్పణం చేసుకున్నాడు.

ఎవరీ కిష్టయ్య?

నిజామాబాద్ జిల్లా శివాయిపల్లికి చెందిన పుట్టకొక్కుల కిష్టయ్య ముదిరాజ్  చిన్ననాటి నుండే చురుకైన వ్యక్తి. అన్యాయాలపట్ల తీవ్రంగా స్పందించేవాడు. డిగ్రీ వరకు విద్యనభ్యసించాడు. భార్య పద్మావతి. ఆత్మబలిదానం చేసుకున్న తెలంగాణ ముద్దుబిడ్డ కిష్టయ్య పేదింటి బిడ్డ. ఆకలి, దారిద్య్రం అతని నేస్తాలు. చిన్నప్పుడే తండ్రి, తల్లిని కోల్పోయాడు. కూలీ, నాలీ చేసి తెచ్చుకొనే గ్రాసమే బతుకుదెరువు. కిందా మీద పడి డిగ్రీ చదివాడు. సగటు తెలంగాణ మట్టిబిడ్డల లెక్కనే కొలువుకోసం ఎదురుచూపులు. ఆ సమయంలో దొరికింది పోలీస్ నౌకర్. 17 ఏళ్లపాటు సర్వీసులోనే ఉన్నాడు. 

రాజ్యం అప్పచెప్పిన లాఠీ డ్యూటీలో ఎన్నడూ కార్యదీక్షను వీడలేదు. 15 సార్లు కమాండేషన్ అవార్డులను అందుకున్నాడంటే అతని వృత్తి నిబద్ధత ఎంత గట్టిదో అర్థం చేసుకోవచ్చు. అయినా, ఆంధ్ర పోలీస్ బాస్‌లదే ఇష్టారాజ్యం. తెలంగాణ వారిపై చిన్నచూపు. సకాలానికి ప్రమోషన్లు దొరకని దుస్థితి. ఆంధ్ర బాస్‌లపై నారాజ్ అయ్యిండు. అదే సమయంలో మహోన్నతంగా సాగుతున్న తెలంగాణ ఉద్యమం వైపు మళ్లిండు. ‘అచ్చినట్టే అచ్చి తెలంగాణ పోవుడేంది? నా ప్రమోషన్ అడ్డుకుంటున్న ఆంధ్రోళ్ల పోలిటికల్ బాస్ తెలంగాణను ఆపబట్టిరి. నా అసుంటి పేద పోలీసు సల్లగుండాలంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే శరణ్యం’ అని ఇంట్లో భార్య, పిల్లలకి కూడా ఆయన నూరి పోయవట్టే. కనబడ్డ దోస్తులకూ గదే జెప్పబట్టే. అందరూ ఆయన అంతరంగాన్ని అర్థం చేసుకున్నవారే. కానీ, అన్నీ తెలిసిన పదిమందికి మంచి చెడునూ చెప్పే అతని మనసు నిండా గందరగోళం. తెలంగాణను తెర్లు చేస్తున్న ఆంధ్రోళ్లపై కోపం పెరిగింది. ఇక చేసేదేముంది?

తేది 1.-12-.2009న అందరూ ఆదమరచి నిద్రిస్తున్న వేళ, తను మాత్రం ప్రత్యేక రాష్ట్రం కోసం ఆలోచిస్తూ కామారెడ్డి పట్టణంలోని సెల్ టవర్ ఎక్కాడు కానిస్టేబుల్ కిష్టయ్య ముదిరాజ్. వార్త తెలిసిన ప్రజలంతా మేల్కొని అక్కడికి వచ్చారు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగం చేస్తానని పదే పదే వెల్లడించాడు. పలుమార్లు ‘జై తెలంగాణ’ అంటూ నినాదాలు చేశాడు. తాను తెలంగాణ కోసం వీర మరణం పొందుతున్నానని, మీరుకూడా ప్రాణత్యాగం చేయాలని భార్య పిల్లలకు సూచించాడు. కొందరు టవర్ ఎక్కే ప్రయత్నం చేయగా తనవద్ద గల రివాల్వర్‌తో కాల్చి వేస్తానని బెదిరించాడు. తనకు ఆటంకం కలిగించినా కాల్చుకుంటానని హెచ్చరించాడు. అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో తుపాకితో కాల్చుకుని కుప్పకూలాడు. అంతకు ముందు తన సూసైడ్ నోట్ ప్రతులను కిందికి జార విడిచాడు. తనకు విధి నిర్వహణలో జరిగిన అన్యాయాన్ని చెబుతూ ‘పోలీసు శాఖలో తనలాంటి వారికి న్యాయం జరగాలంటే ప్రత్యేక తెలంగాణ రావాల్సిందేనని’ అందులో పేర్కొన్నాడు. తన ప్రాణత్యాగంతోనైనా తెలంగాణ ఏర్పాటు కావాలని అభిలషించాడు. 

సంబంధిత పోలీసు శాఖ అధికారులు కూడా వచ్చారు. సెల్ టవర్ దిగి రమ్మని నచ్చజెప్ప జూశారు. తనకు బదులుగా ఒక చీటి కిందికి రాలింది. అందులో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను వివరంగా రాశాడు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ కావాలని నినదిస్తూ తన వద్ద వున్న సర్వీస్ పిస్తోల్‌తో కాల్చుకున్నాడు. టవర్ పైనుండి పిట్టలా కిందికి కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. ‘కిష్టయ్య అమర్ హై, తెలంగాణ జైజై తెలంగాణ’ నినాదాలు మిన్నుముట్టాయి.

‘రెంటికీ చెడ్డ రేవడి’ అంటరు. సమైక్య పాలనలో కానిస్టేబుల్ కిష్టయ్య బతుకు అట్లే అయ్యింది. తెలంగాణ ధర్మ పోరాటంలో తన తోటి తమ్ముళ్లపై లాఠీలు దూయలేక విలవిల్లాడిండు. తెలంగాణ బిడ్డనైనందున పోలీసు అధికారుల వివక్షను భరించలేక తల్లడిల్లిండు. చివరాఖరికి అంతెత్తు స్థూపం వలే ఉన్న టవర్ నుండి తెలంగాణ ఒడిలో రాలి పడ్డడు-, తనను తాను తూటాతో కాల్చుకొని.

ఆయన లేఖలోని అంశాలు.. ‘ప్రత్యేక దేశం కాదు కదా, మనం కోరేది. తెలంగాణ రాష్ట్ర పోరాటాన్ని తీవ్రం చేయండి. మన రాష్ట్రం తెలంగాణ వచ్చిన తర్వాత లంచాన్ని హత్యా నేరంతో సమానంగా చూడండి. కేసీఆర్ గారూ! తెలంగాణ వచ్చేవరకు నాలాం టి వారు ఎందరు బలైనా దీక్ష విరమించకండి. ఓయూ, కేయూ విద్యార్థి సోదరులా రా! పరీక్షలు రాసి పాసైనా ఉపాధి దొరుకని చదువులెందుకు? పోరాటాన్ని ఆపకండి. పార్టీలకు అతీతంగా ప్రజలంతా ఉధృతంగా పోరాడండి. ఒక పుట్టుక, ఒక చావు. మధ్యలో ఉద్యోగరీత్యా న్యాయంగా ఉండి, న్యాయం చేశాను. సోదర పోలీసులారా! పాలకులకు ఉదయం నుండి ఉదయం వరకు జీవితాంతం సేవలు చేద్దామా? వెన క్కు రండి. మనం మనం కొట్టుకోవడం ఎందుకు? తెలంగాణ వచ్చేవరకు పోరాడండి. ఉధృతంగా పోరాటం చేయండి. తెలంగాణ వచ్చాక నా భార్యా పిల్లలకు సహాయం చేయుండ్రి కిష్టయ్య.

ప్రశ్నించే తత్వం ఉన్నవారిని బాదేందుకు రాజ్యం ఇచ్చిన లాఠీని ఠాణాలో పెట్టాడు. ఆత్మరక్షణ పేరిట పేదల అణచివేతకు రాజ్యం ఇచ్చిన ఆ తుపాకీతోనే కాల్చుకుంటూ ‘జై తెలంగాణ... జైజై తెలంగాణ’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించాడు. సెల్ టవర్‌పైనే ప్రాణాలు వదిలాడు. 

అమరుడైన కిష్టయ్య 1992 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్. సిరికొండ, గాంధారి, ఆర్మూర్, దేవునిపల్లి, మాచారెడ్డి పోలీస్ స్టేషన్‌లలో పని చేశాడు. ఎక్కువగా తీవ్రవాద ప్రాబల్య ప్రాంతాలలో కీలక బాధ్యతలను నిర్వహించాడు. ఆయనకు భార్య పద్మ, కూతురు ప్రియాంక, కుమారుడు రాహుల్ ఉన్నారు. స్వగ్రామమైన శివాయిపల్లిలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో సబ్బండ వర్గాలు, వర్ణాలు అందరూ పాల్గొన్నారు. ఆత్మబలిదానాలు కావించుకున్నారు. ‘కానిస్టేబుల్ ముదిరాజ్ ఒక్కడు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగి’ అన్నది గమనార్హం. జేఏసీల ద్వారా సకలజనుల సమ్మె, సాగర హారం లాంటి చారిత్రాత్మక పోరాటాలలో ఉద్యోగులు పోషించిన పాత్ర కొనియాడదగింది. కానీ, ప్రాణాలిచ్చిన ఉద్యోగి మాత్రం కిష్టయ్యనే. ఈ విషయాన్ని ఉద్యోగ సంఘాల బాధ్యులు సముచిత రీతిలో గుర్తించి, ఆయనకు నివాళులు అర్పించాలి. ఇప్పటికైనా ఉద్యమ చరిత్రకారులు వాస్తవాల ఆధారంగా భవిష్యత్ తరాల వారికి అమరుల గురించి వివరించాలి.

శాంతిభద్రతలను కాపాడే పేరుతో వలసవాదుల అనుకూలురైన పోలీసు అధికారుల పాశవిక దాడులను సహించలేక, ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన తెలంగాణ కానిస్టేబుల్ కిష్టయ్య అమరత్వాన్ని రాష్ట్ర పోలీస్ శాఖ గుర్తించాలి. ఈమేరకు అమరవీరునికి సముచిత స్థానం కల్పించాలి. పోలీస్ స్టేషన్లలో ఆయన చిత్రపటంతోపాటు అన్ని జిల్లాలు, మండల కూడళ్లలో విగ్రహాలను స్థాపించాలి.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వారి సతీమణికి, కుమారునికి ఉద్యోగ అవకాశం కల్పించింది. ఇంటి స్థలాన్ని కేటాయించి నిర్మాణానికి కూడా సహకరించింది. అదే విధంగా ఆయన కుమార్తెకు వైద్యవిద్యను అభ్యసించడానికి తోడ్పాటు అందించింది. ఉద్యమాల ద్వారా సాధించుకున్న తెలంగాణను అస్థిర పరచడానికి అనేక శక్తులు కుయుక్తులు పన్నుతున్న వేళ రాష్ట్ర పునర్నిర్మాణంలో అందరం భాగస్వాములం అవుదాం.

 పల్లెబోయిన అశోక్, 

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,

తెలంగాణ ముదిరాజ్ మహాసభ