31-01-2026 12:52:25 AM
భారత సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా, తెలంగాణ రాష్ర్టంలోని వివిధ జైళ్లలో ఉన్న అర్హత గల జీవిత ఖైదీలను తక్షణమే ముందస్తు విడుదల చేయాలని మానవ హక్కుల వేదిక (హెచ్‌ఆర్‌ఎఫ్) తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. జీవిత ఖైదీలు సహా ఇతర శిక్షలు అనుభవిస్తున్న ఖైదీలకు రెమిషన్, ముందస్తు విడుదల విధానంపై స్పష్టమైన పాలసీ రూపొందించాలంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానం 18.02.2025 నాడు స్వయం స్వీకరణ రిట్ పిటిషన్ (సుమోటో) క్రిమినల్ నం. 4/2021 తో పాటు ఎస్‌ఎల్పీ (క్రిమినల్) నం. 529/2021 లో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఈ ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హోం మంత్రిత్వ శాఖ ద్వారా జీవిత ఖైదీలకు ప్రత్యేక రెమిషన్ మంజూరు చేయడానికి సంబంధించి శాశ్వత మార్గదర్శకాలను నిర్ధారిస్తూ 27.10.2025 తేదీన జీవో ఎంఎస్ నంబర్.126ను జారీ చేసింది.
ఈ ప్రభుత్వ ఉత్తర్వులో అర్హత గల జీవిత ఖైదీలను గుర్తించడం, వారి కేసులను ముందస్తు విడుదలకు పరిశీలించడం కోసం అనుసరించాల్సిన విధివిధానాలు, ప్రమాణాలు స్పష్టంగా పేర్కొనబడ్డాయి. సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసి దాదాపు ఒక సంవత్సరం పూర్తవుతుండగా, తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసి దాదాపు మూడు నెలలు గడిచిపోయాయి. అయినప్పటికీ, ఈ ముందస్తు విడుదల విధానాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి స్పష్టమైన చర్యలు తీసుకున్నట్లు కనిపించడం లేదు.
జీవిత ఖైదీలు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక వేదనతో, ఆందోళనతో జీవిస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా శిక్ష అనుభవిస్తున్న, అర్హలైన తమ వారిని విడుదల చేస్తారని ఆశించారు. కానీ అది జరగలేదు. పైన పేర్కొన్న జీవో ప్రకారం, జైళ్ల శాఖ, ప్రతి నాలుగు నెలలకు ఒకసారి అరులైన జీవిత ఖైదీల జాబితాను సిద్ధం చేసి, స్టాండింగ్ కమిటీ ముందు ఉంచాల్సి ఉంటుంది. అయితే, ప్రభుత్వం అర్హులైన ఖైదీలను గుర్తించే ప్రక్రియను ప్రారంభించిందా లేదా అన్న విషయంపై ఇప్పటివరకు ఖైదీలకు గానీ, వాళ్ళ బంధువులకు గానీ ఎటువంటి సమాచారం లేదు.
ఈ విధమైన నిర్లక్ష్యం సుప్రీంకోర్టు గుర్తించిన రెమిషన్, సంస్కరణ, రాజ్యాంగబద్ధమైన స్వేచ్ఛ మౌలిక స్ఫూర్తికే విరుద్ధం. న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణ దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ఆలస్యం లేకుండా ఈ ప్రక్రియను వేగవంతం చేయాలి. జీవోఎంఎస్ నంబర్ 126ను సుప్రీంకోర్టు సూచించిన మార్గదర్శకాల వెలుగులో యథాతథంగా అమలు చేసి, అర్హత గల జీవిత ఖైదీలను ముందస్తుగా విడుదల చేసే ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని ఈ సందర్భంగా మానవ హక్కుల వేదిక తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతోంది.
ఎస్. జీవన్ కుమార్
కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు,
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు,
మానవ హక్కుల వేదిక.
డా. ఎస్. తిరుపతయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.