31-01-2026 12:54:57 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపుల పర్వాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ట్రంప్ రెండోసారి అధ్యక్ష పీఠమెక్కిన తర్వాత మాట వినని దేశాలపై ఎడాపెడా సుంకాలు విధిస్తూ వస్తున్నారు. అడ్డగోలు టారిఫ్‌లు, అనవసరమైన చర్యలతో మిత్ర దేశాలను సైతం దూరం చేసుకుంటున్నారు. గ్రీన్‌లాండ్ విషయంలో అమెరికాకు మద్దతు ఇవ్వలేదన్న కారణంతో యూరోపియన్ యూనియన్ (ఈయూ) కూటమిపై 25 శాతం అదనపు సుంకాలు విధిస్తానంటూ బెదిరింపులకు దిగినప్పటికీ, ఏమైందో తెలియదు ఉన్నపళంగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.
ఇంత జరుగుతున్నా ట్రంప్ ప్రపంచ దేశాలపై బెదిరింపులను మాత్రం ఆపడం లేదు. ఈయూ కూటమి ఇటీవలే భారత్‌తో చేసుకున్న అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ట్రంప్‌కు మింగుడుపడని అంశంగా మారింది. ‘అత్త మీద కోపం దుత్త మీద అన్నట్టు’ ఈయూపై కోపాన్ని ట్రంప్ క్యూబా, కెనడాల వైపు మళ్లించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే వెనిజులా, గ్రీన్‌లాండ్‌లను సొంతం చేసుకున్న ట్రంప్ గురి ఇప్పుడు క్యూబాపై పడినట్లుంది. క్యూబాలో ఏడు దశాబ్దాలుగా సాగుతున్న కమ్యూనిస్టు పాలనను అంతం చేసి తన అధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నాలు ఆరంభించా రు.
ఈ క్రమంలో క్యూబాను అమెరికా జాతీయ భద్రతకు ముప్పుగా ప్రకటించారు. వెనిజులాలో మదురోను బంధించడానికి అనుసరించిన విధా నాన్నే క్యూబాలోనూ అమలు చేయాలని భావిస్తున్నారు. అమెరికాతో ఒప్పందానికి రాకుంటే క్యూబా భారీ ముల్యం చెల్లించుకోవాల్సి వస్తుంద ని హెచ్చరించారు. అయితే క్యూబాకు ఆర్థికంగా అండగా ఉండే వెనిజులాలో ప్రభుత్వ మార్పిడితో క్యూబాకు చమురు సరఫరా నిలిచిపోయింది.
దీంతో క్యూబా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ పరిస్థితిని తీవ్రతరం చేయడానికి క్యూబాకు చమురు విక్రయించాలని చూసే దేశాలపై సుంకాలు విధిస్తానంటూ ట్రంప్ హెచ్చరించారు. మరోవైపు మొదటి నుంచి కెనడా విషయంలో ఆగ్రహంగా ఉన్న ట్రంప్ మరోసారి బెదిరింపులకు దిగారు. చైనాతో ట్రేడ్‌డీల్ వ్యవహారమై ఇప్పటికే కెనడాను హెచ్చరించిన ట్రంప్ తాజాగా అమెరికాలోకి దిగుమతయ్యే ఆ దేశ విమానాలపై 50 శాతం టారిఫ్‌లు విధిస్తానంటూ బెదిరింపులకు దిగారు.
జార్జియా కేంద్రంగా పనిచేస్తున్న అమెరికాకు చెందిన గల్ఫ్‌స్ట్రీమ్ ఏరోస్పేస్ జెట్‌లకు సర్టిఫై చేసేందుకు కెనడా నిరాకరించడమే ఇందుకు కారణం. ఇక ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీని గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్న ట్రంప్ ఒకవైపు దాడులకు ముందే చర్చలకు రావాలని చెబుతూనే మరోవైపు పశ్చిమాసియాకు యుద్ధ విమానాలు, నౌకలను తరలించడాన్ని ఆపడం లేదు.
ఇరాన్ చుట్టూ భారీ యుద్ధనౌకలను మోహరించిన ట్రంప్ ఖమేనీ పాలనను అంతం చేసి లక్ష్యాన్ని సాధించాలని కలలు కంటున్నప్పటికీ, ఇరాన్ అంత సులువుగా లొంగేటట్లు కనిపించడం లేదు. తనతో కలిసి నడిచేవారికి అందలమిస్తున్న ట్రంప్ అదే సమయంలో తనకు విరుద్ధంగా నడుచుకుంటున్న దేశాలపై బెదిరింపులకు దిగడం ఒక అలవాటుగా మార్చుకున్నారనిపిస్తున్నది. ఇటీవల శాంతి కాముకుడనంటూ ‘గాజా శాంతి మండలి’ పేరుతో ఐక్యరాజ్యసమితికి పోటీగా బోర్డును ఏర్పాటు చేసిన ట్రంప్ మాటలు, చేతలు మాత్రం శాంతికి విరుద్ధంగా ఉంటున్నాయనడంలో సందేహం లేదు.