calender_icon.png 15 July, 2025 | 6:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమీషన్లు రావనే స్కాలర్‌షిప్ బకాయిలు చెల్లించడం లేదా?

15-07-2025 12:41:53 AM

  1. రూ.6 వేల కోట్ల బకాయిలు విడుదల చేయాలి
  2. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్
  3. సీఎస్ రామకృష్ణారావుతో భేటీ

హైదరాబాద్, జూలై 14 (విజయక్రాంతి): విద్యార్థుల ఫీజు రీయెంబర్స్‌మెంట్ చెల్లిస్తే కమీషన్లు రావని.. అదే కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లిస్తే 10 నుంచి 15 శాతం కమీషన్లు వస్తాయని.. అందుకే 14 లక్షల నిరుపేద విద్యార్థులకు చెల్లించాల్సిన బిల్లులు చెల్లించడం లేదని బీజేపీ ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. రీయెంబర్స్‌మెంట్ స్కీమ్‌ను ఎత్తేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమని ఆయన స్పష్టం చేశారు.

చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న రూ.6 వేల కోట్ల ఫీజు రీయెంబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ సోమవారం సెక్రటేరియేట్‌లో సీఎస్ రామకృష్ణారావుతో భేటీ అయ్యారు. ఒకవైపు ఫీజు బకాయిలు చెల్లించకుండా మరోవైపు ఫీజుల స్కీములను ఎత్తేయడానికి ట్రస్ట్ బ్యాంకును ఏర్పాటు చేసి, దాని ద్వారా ఫీజులు చెల్లిస్తామన్న కొత్త నాటకం కు తెర లేపారని ఆరోపించారు.

ఈ ప్రతిపాదన ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. బకాయిలు చెల్లించక బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని.. ఉన్నత చదువులు మానేసే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుసున్నా కనీసం రూ.20 కూడా విద్యార్థులకు చెల్లించలేదన్నారు. పక్క రాష్ర్టమైన ఏపీలో ఇప్పటికే రెండు దఫాలుగా రూ.1,500 కోట్లు విడుదల చేశారని గుర్తుచేశారు.

బీసీ కాలేజీ హాస్టళ్లలో సీట్లు లభించక విద్యార్థులు రైల్వేస్టేషన్, బస్టాండ్లలో స్నానాలు చేస్తూ రాత్రివేళ అక్కడే పడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే కొత్తగా 100 బీసీ కాలేజీ హాస్టళ్లను మంజూరు చేయాలని, ప్రస్తుతం ఉన్న హాసళ్లలో 20 శాతం సీట్లు పెంచాలని కోరారు. కృష్ణయ్య వెంట బీసీ నేతలు గుజ్జ కృష్ణ, నీలం వెంకటేశ్, జిల్లపల్లి అంజి, బీ కృష్ణ యాదవ్, మోదీ రాందేవ్, రాఘవేందర్, అశోక్ ఉన్నారు.