17-06-2024 12:00:00 AM
ఎండలో వీచే చల్లగాలికి, ఎడారిలో పూచే పూలకు, చీకట్లో వెలిగే దీపానికి విలువ చాలా ఎక్కువ. అవి అంతే మేర ఎంతో అవసరం కూడా. తెలుగు సాహిత్యంలో కొత్త వెలుగు పరచుకొన్నట్టు సాహిత్య త్రైమాసిక పత్రిక ‘పునాస’ హుందాగా పాఠకులను అలరిస్తున్నది. ఏప్రిల్ 2024 సంచిక ఇటీవలె (ఫిబ్రవరి 2024) ‘భారతరత్న’తో సుశోభితులైన బహుభాషావేత్త, భారతదేశ 9వ ప్రధానమంత్రి, తెలుగుజాతి గర్వించదగ్గ మహారచయిత పీవీ నరసింహారావు సుందర ముఖచిత్రంతో వెలువడింది. కరోనా విపత్కాల దుష్ప్రభావం మూలంగా మూత పడి, మళ్లీ కోలుకోలేకుండా వున్న పత్రికా లోకంలో ప్రత్యేకించి, వార పక్ష మాస పత్రికల పఠనం కోసం ఎదురుచూస్తున్న పాఠకులకు ఇది ఒకింత ఊరటను కలిగిస్తున్నట్లుగానే భావించాలి.
‘తెలంగాణ సాహిత్య అకాడమీ’ ఆధ్వర్యంలో మూడు నెలలకోమారు ప్రచురణ అయ్యే పత్రికగా ‘పునాస’ తన విలక్షణమైన పేరును నిలబెట్టుకుంటున్నది. తెలుగు సాహితీ ప్రేమికుల ఆసక్తిని తీర్చే స్థాయిలో పత్రిక అందంగా, హుందాగా, గౌరవప్రదంగా వస్తున్నది. సౌలభ్యమైన సైజు నుంచి మంచి న్యూస్‌ప్రింట్ వరకు పత్రిక ఆసాంతం అలరించే రీతిలో ఉంది. సామాన్య పాఠకుల నుంచి సాహితీవేత్తల వరకు అందరూ విడవకుండా చదివేలా కంటెంట్‌ను అందిస్తున్నారు. పత్రికకు కార్యనిర్వాహక సంపాదకులుగా డా.ఎన్.బాలాచారి వ్యవహరిస్తుండగా, సంపాదక మండలిలో డా.రాపోలు సుందర్శన్, డా. యూకూబ్‌లు వున్నారు.
సాహిత్య వ్యాసాలతోపాటు కథలు, కవితలు, పుస్తకాల సమీక్షలతోసహా సాహిత్య సంబంధమైన వార్తలకు కూడా పత్రికలో చోటు లభిస్తున్నది. ఈ సంచికలో పీవీ నరసింహారావు సుప్రసిద్ధ కథ ‘గొల్ల రామవ్వ’ ప్రత్యేక ఆకర్షణగా చెప్పాలి. అలాగే, పీవీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయిన సందర్భంలో ‘జనధర్మ’ పత్రిక ప్రత్యేక సంచికలో దాశరథి, సినారె మహాకవులు వెలువరించిన కవిత్వాలను ప్రచురించారు. పత్రిక మూడు నెలలకు ఒకసారి వస్తుంది కనుక, సాధ్యమైనంత ఎక్కువ కంటెంట్‌ను ఇవ్వడానికే సంపాదకులు ప్రయత్నించినట్టు కనిపిస్తున్నది. మొత్తం 98 పేజీల పత్రికలో 14 కవితలతోపాటు నాలుగు కథలూ ప్రచురించారు.