calender_icon.png 18 November, 2025 | 12:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీఏసీ చైర్మన్‌గా అరికెపూడి గాంధీ

10-09-2024 04:58:47 AM

  1. మూడు అసెంబ్లీ కమిటీల నియామకం 
  2. ఎస్టిమేషన్ కమిటీ చైర్మన్‌గా పద్మావతిరెడ్డి
  3. పీయూసీ కమిటీకి వీర్లపల్లి శంకర్‌కు అవకాశం 
  4. పీఏసీ చైర్మన్ పదవిని ప్రతిపక్షానికి కేటాయించే ఆనవాయితీ 
  5. హరీశ్‌రావు పేరును ప్రతిపాదించిన బీఆర్‌ఎస్ 
  6. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన గాంధీకి బాధ్యతలు  
  7. అభ్యంతరం వ్యక్తం చేస్తున్న బీఆర్‌ఎస్

హైదరాబాద్, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): పీఏసీ చైర్మన్‌గా ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ నియమతులయ్యారు. తెలంగాణ శాసన సభకు సంబంధించి పబ్లిక్ ఆకౌంట్స్, ఎస్టిమేషన్ కమిటీ, పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీలకు చైర్మన్ల పేర్లను ప్రకటించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఆదేశాల మేరకు అసెంబ్లీ కార్యదర్శి వి. నర్సింహ్మాచార్యులు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కో కమిటీకి చైర్మన్‌తో పాటు 12 మంది ఎమ్మెల్యేలను కమిటీలో నియమించారు. ప్రధాన ప్రతిపక్షానికి కేటాయించే  శాస నసభా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్ గా బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని నియమించారు.

పీఏసీ  చైర్మన్‌గా బీఆర్‌ఎస్ ఎమ్మె ల్యే హరీశ్‌రావుకు అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ ప్రతిపాదించింది. అయితే ఇటీవల బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన గాంధీకి ఇవ్వడంతో బీఆర్‌ఎస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గాంధీ కాంగ్రెస్‌లో చేరినా అసెంబ్లీలో సాంకేతికపరంగా బీఆర్‌ఎస్ సభ్యుడిగానే కొనసాగుతున్నారు. పీఏసీ చైర్మన్ పదవిని ప్రధాన ప్రతిపక్షానికే ఇచ్చామని అధికార కాంగ్రెస్ చెప్పుకునే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. ఇక ఎస్టిమేషన్ కమిటీ చైర్ పర్సన్‌గా కాంగ్రెస్ పార్టీకి చెందిన కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతిరెడ్డి నియమితులయ్యారు. 

పబ్లిక్ అకౌంట్స్ కమిటీ..

పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్  అరికెపూడి గాంధీ,  సభ్యులుగా వేముల ప్రశాంత్‌రెడ్డి,  గంగుల కమలాకర్ (బీఆర్‌ఎస్), రేవూరి ప్రకాశ్‌రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి (కాంగ్రెస్), రామారావు పటేల్ (బీజేపీ), అహ్మద్‌బిన్ అబ్దుల్లా బలాలా (ఎంఐఎం), కూనంనేని సాంబశివరావు (సీపీఐ), శాసనమండలి నుంచి టి. జీవన్‌రెడ్డి (కాంగ్రెస్), టి. భానుప్రసాదరావు, ఎల్. రమణ, సత్యవతి రాథోడ్ (బీఆర్‌ఎస్)లను నియమించారు. 

ఎస్టిమేషన్ కమిటీ .. 

ఎస్టిమేషన్ కమిటీ చైర్మన్‌గా  కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మవాతిరెడ్డికి అవకాశం ఇవ్వగా సభ్యులుగా వాకిటి సునీతా లక్ష్మారెడ్డి, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మాగంటి గోపినాథ్ ( బీఆర్‌ఎస్), విజయరమణారావు, కోరం కనకయ్య, రామదాసు మాలోతు, యశశ్వినీరెడ్డి (కాంగ్రెస్) రాకేశ్‌రెడ్డి (బీజేపీ), శాసనమండలి నుంచి ఎంఎస్ ప్రభాకర్, సుంకరి రాజు, రవీందర్‌రావు, యాదవరెడ్డి (బీఆర్‌ఎస్) ఉన్నారు. 

అండర్ టేకింగ్ కమిటీ.. 

అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్‌గా షాద్‌నగర్ ఎమ్మెల్యే వి. శంకరయ్య, సభ్యులుగా కేపీ వివేకానంద ( బీఆర్‌ఎస్), వేముల వీరేశం, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మక్కాన్‌సింగ్ ఠాకూర్, లక్ష్మీకాంతరావు (కాంగ్రెస్), మోహినోద్దీన్ ( ఎంఐఎం)లు ఉన్నారు. కౌన్సిల్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తాతా మధు (బీఆర్‌ఎస్), మీర్జా రియాజుల్ హస్సన్ (ఎంఐఎం)ను నియమించారు.