22-08-2025 10:42:30 PM
నిర్మల్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్ దేవేందర్ రెడ్డి చికిత్సను గుర్తించి ఆర్మీ మేజర్ ప్రశంసా పత్రాన్ని పంపారు. వివరాల్లోకి వెళ్తే.. గత రెండు నెలల కిందట ఆర్మీ మేజర్ హైదరాబాద్ నుంచి జబల్ పూర్ కు బదిలీ అయ్యాడు. ఈ మేరకు తన కుటుంబంతో కలిసి నిర్మల్ మీదుగా జబల్ పూర్ వెళ్తుండగా... స్థానిక కొండాపూర్ బ్రిడ్జి వద్ద ప్రమాదం జరిగింది. వారిని స్థానికులు నిర్మల్ లోని దేవేందర్ రెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కి తీసుకువచ్చారు.
ఈ మేరకు డాక్టర్ దేవేందర్ రెడ్డి 24 గంటలు హాస్పిటల్లోనే ఉండి మేజర్ కుటుంబానికి అత్యుత్తమ చికిత్సను అందించారు. అనంతరం వారిని ఆర్మీ హాస్పిటల్ కు తరలించారు. దీంతో దేవేందర్ రెడ్డి సేవలను ఆ మేజర్ గుర్తుంచుకొని, నిర్మల్ పోలీసులకు ప్రశంసా పత్రాన్ని పంపించి ,డాక్టర్ కు అందించాలని కోరారు.దీంతో ఈ ప్రశంసా పత్రాన్ని శుక్రవారం జిల్లా కేంద్రంలోని సబ్ డివిజనల్ కార్యాలయంలో ఏఎస్పీ రాజేష్ మీనా డాక్టర్ దేవేందర్ రెడ్డికి అందజేశారు.