22-08-2025 10:46:13 PM
రేగొండ,(విజయక్రాంతి): ప్రజా ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ది పనులకు ప్రాధాన్యత ఇవ్వడానికే పనుల జాతర కార్యక్రమాన్ని ప్రారంభించిందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాల ఆవరణలో అంగన్వాడి కేంద్రం, ఇంకుడు గుంత నిర్మాణానికి శంకుస్థాపన చేసి మాట్లాడారు. మండలంలో సుమారు 305 పనులను ప్రారంభించామని ప్రజా ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని తెలిపారు.
అలాగే వర్షా కాలంలో ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పరిసరాల పరిశుభ్రత ప్రజలదేనని అన్నారు.పరిసరాల్లో నీటి నిల్వ లేకుండా చూడాలని దొమలతో మలేరియా, వైరల్, డెంగ్యూ వ్యాధులు ప్రభలే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. నియోజకవర్గంలో రైతులకు ఇబ్బంది లేకుండా ఆయకట్టు వరకు గ్రావెల్ రోడ్లు నిర్మిస్తున్నమన్నారు.గ్రామాలు, మండలాలను కనెక్ట్ చేసే రోడ్లు డబుల్ రోడ్లు గా, నాలుగు లైన్ ల రోడ్లు గా విస్తరణ చేపడతామని అన్నారు.
వేణుగోపాలస్వామి ఆలయ అభివృద్ది పనులు అభినందించిన ఎమ్మెల్యే
మండల కేంద్రంలో అంగన్వాడి భవన నిర్మాణానికి శంకుస్థాపన అనంతరం వేణుగోపాల స్వామి ఆలయ ఆర్చ్ నిర్మాణాన్ని పరిశీలించి శిల్పుల పని విదానాన్ని అభినందించారు. శిల్పుల తో మాట్లాడి ఆలయ పనుల గురించి అడిగి తెలుసుకొని ఆలయ దాత సీతరాం రెడ్ది చేస్తున్న కృషిని అభినందించారు.
వేణుగోపాల స్వామి ఆలయానికి సీసీ రోడ్డు నిర్మాణానికి అంచనా రూపొందించాలని అధికారులను ఆదేశించారు.అలాగే పోచమ్మ గుడిని సందర్శించి గుడి పునర్నిర్మాణానికి 10లక్షలు రూపాయలు మంజూరు చేస్తున్నానని అన్నారు.పరిసరాల్లో సెంట్రల్ లైటింగ్ కూడా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. మరోసారి ఆలయాలను సందర్శించి వాటి అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.