28-05-2025 07:43:33 PM
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్..
నిర్మల్ (విజయక్రాంతి): బక్రీద్ పండుగను శాంతియుతంగా, సమగ్రంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(District Collector Abhilasha Abhinav) అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన బక్రీద్ పీస్ కమిటీ సమీక్షా సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... రాబోయే జూన్ నెలలో జరగనున్న బక్రీద్ పండుగ సందర్భంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలోని ఈద్గా ప్రదేశాల్లో పిచ్చి మొక్కలను తొలగించి, పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు.
ప్రార్థనలకు వచ్చే ముస్లిం సోదరులకు టెంటులు, షామియానాలు, త్రాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. విద్యుత్ శాఖ అధికారులు ఈద్గా ప్రదేశాల్లో విద్యుత్ సరఫరా పరిస్థితిని పర్యవేక్షించి, అవసరమైన చోట మరమ్మతులు చేపట్టి సరఫరా పునరుద్ధరించాలన్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలు, పుకార్లు వ్యాపించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చ్చరించారు. అన్ని మతపరమైన వేడుకలను అన్నదమ్ములమయిన భావంతో శాంతియుతంగా జరుపుకోవాలని కలెక్టర్ ప్రజలకు సూచించారు.
జిల్లా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ... బక్రీద్ పండుగ సందర్భంగా పోలీసు శాఖ తరపున జిల్లాలో పటిష్ట భద్రతా చర్యలు చేపడతామని తెలిపారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో పోలీస్ బలగాలు అప్రమత్తంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లు పైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, పీస్ కమిటీ సభ్యులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.