calender_icon.png 11 May, 2025 | 6:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్తీ మద్యం తయారీదారుల అరెస్ట్

07-04-2025 12:21:17 AM

పోలీసుల అదుపులో ఐదుగురు, పరారీలో మరో ఇద్దరు నిందితులు

నల్లగొండ, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లాలో సంచలనం సృష్టించిన కల్తీ మద్యం తయారీ కేసులో పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరి నుంచి 600 లీటర్ల స్పిరిట్, 400 లీటర్ల కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ మీడియాకు కేసు పూర్వాపరాలు వెల్లడించారు.

చండూరుకు చెందిన మహ్మద్ జానీపాషా హైదరాబాద్లో 2016లో మటన్ షాపులో పనిచేశాడు. అక్కడే అతనికి తుర్కయంజాల్కు చెందిన శ్రీనివాస్తో పరిచయం ఏర్పడడంతో అతడి వద్ద రెండేండ్లు డ్రైవర్గా పని చేశాడు. ఈ క్రమంలో శ్రీనివాస్ బామ్మర్ది బెంగుళూర్కు చెందిన శ్రీనివాస్ గౌడ్ తో జానీకి పరిచయం ఏర్పడింది. ఇతడిపై 2019లో నకిలీ మద్యం తయారీ కేసులున్నాయి.

6 నెలల క్రితం జానీకి శ్రీనివాస్గౌడ్  ఫోన్ చేసి రూ. 5 లక్షలు ఇస్తే 10 లక్షల విలువైన నకిలీ మద్యం తయారు చేసి ఇస్తానని చెప్పాడు. దీంతో జానీ చండూరు చెందిన ఎర్రజల్ల రమేశ్, దోమలపల్లికి చెందిన యాదగిరితో కలిసి నాంపల్లి మండలం గానుగపల్లిలోని రమేశ్ తోటలో నకిలీ మద్యం తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. ఫిబ్రవరిలో 5 డ్రమ్ముల స్పిరిట్ తెచ్చి రమేశ్ తోటలో దాచారు.

ముగ్గురు కలిసి శ్రీనివాస్గౌడ్కు రూ.6 లక్షలు ఇచ్చి కర్ణాటక నుంచి రప్పించి అతడు తెచ్చిన ముడి సరుకు, రెండు డ్రమ్ముల స్పిరిట్ కలిపి కల్తీ మద్యం తయారు చేశారు. దీన్ని 20 లీటర్ల 40 వాటర్ బబూళ్లలో నింపి పులియ బెట్టారు. రెండుమూడు రోజుల తరువాత సరుకు విక్రయించేందుకు మునుగోడులోని ఓ వైన్ షాప్ భాగస్వామైన జాల వెంకటేశ్ను కలిశారు. ప్యాకింగ్ సరిగా లేదని అతడు నిరాకరించాడు.

దీంతో రమేశ్ తన అత్తగారి ఊరైన జీ.యడవెల్లిలో తనకు పరిచయమున్న బొమ్మరబోయిన భార్గవ్ను సంప్రదించగా అతడు రూ.10 వేలకు 4 బబుల్స్ కొన్నాడు. ఈ మద్యాన్ని బెల్ట్ షాపుల నిర్వాహకులకు సరఫరా చేసేందుకు ప్రయత్నించగా వారు నిరాకరించారు.  ఆటో డ్రైవర్  సాయం ఉపేంద్ర నకిలీ మద్యాన్ని నిందితులు చెప్పిన చోటుకు తరలించి సహకరించాడు. ఈ ఐదుగురిని ఇటీవల నాంపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.

దందాతో సంబంధం ఉన్న శ్రీనివాస్గౌడ్, యాదగిరి పరారీలో ఉన్నట్లు  ఎస్పీ పేర్కొన్నారు. దేవరకొండ ఏఎస్పీ పి.మౌనిక, టాస్క్ ఫోర్స్ సీఐ రమేశ్‌బాబు, ఎస్సైలు మహేందర్, శివ ప్రసాద్ నాంపల్లి సీఐ రాజు, ఎస్‌ఐ శోభన్బాబును సిబ్బందిని ఎస్పీ అభినందించారు.