calender_icon.png 24 August, 2025 | 5:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ వంటలక్క యాదమ్మ

24-08-2025 12:18:52 AM

ఆమె చేతితో వండిన వంటలు తిన్నారంటే మీ జీవితం ధన్యమైనట్లే. తన జీవితంలో కడుపు నింపుకోవడానికి పడిన కష్టాలతో ఆకలినే ఆయుధంగా చేసుకుని బతుకుదెరువు కోసం రకరకాల వంటలు చేస్తూ జీవించింది. ఈ క్రమంలో ఆమె చేతివంట రుచి ఆ నోటా ఈ నోటా తెలంగాణ నుంచి ప్రపంచస్థాయికి పాకింది. ప్రధాని మోదీ నుంచి కేసీఆర్ వరకు ఎందరో ప్రముఖులు ఆమె చేతి వంట రుచి చూసి అమోఘం అంటూ మెచ్చుకున్నారు.

ఎక్కడో తెలంగాణలోని మారుమూల కొండాపూర్ గ్రామం నుంచి ప్రపంచస్థాయికి ఎదిగి అందరి ప్రశంసలు అందుకుంది. ఓ సాధారణ కూలీ నుంచి చెఫ్‌గా మారి తెలంగాణ వంటలక్కగా మారిన యాదమ్మ జీవిత ప్రస్థానం నిరాశ, నిస్పృహలతో బతుకుతున్న ఎందరో మహిళలకు స్ఫూర్తిదాయకం. తెలంగాణకే పరిమితమైన వంటలను తయారు చేస్తూ అందరి మన్ననలు పొందుతున్న యాదమ్మ ఎందరికో ఉపాధి కల్పిస్తూ.. నేడు తెలంగాణ వంటలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు.

తెలంగాణలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ వంటలు రుచి చూపించి ప్రధాని మోదీ నుంచి అనేకమంది ప్రముఖులచేత కితాబు అందుకున్న యాదమ్మ కరీంనగర్ జిల్లాకు చెందిన ముద్దుబిడ్డ. పొట్ట కూటికోసం కూలీ పనిచేస్తూ నేడు చెఫ్ వరకు ఎదిగి 50 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. గూళ్ల యాదమ్మది కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్. 15వ ఏటనే చంద్రయ్యతో పెళ్లయింది.

బతుకుదెరువు కోసం కరీంనగర్ చేరుకున్న యాదమ్మ మంకమ్మతోటలో కుక్ వెంకన్న దగ్గర రోజువారీ కూలీ పనిచేస్తూ వంటలు నేర్చుకుంది. 15 రూపాయల కూలీతో జీవితాన్ని ప్రారంభించిన యాదమ్మ నేడు తెలంగాణ వంటలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. గత 30 ఏళ్లుగా వంటలు చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. భర్త చంద్రయ్య వ్యవసాయ బావుల్లో పూడికలు తీయడానికి వెళ్లి మట్టి పెళ్లలు కూలి ప్రాణాలు కోల్పోయారు.

భర్త అకాల మరణంతో అత్తింటి వేధింపులు తట్టుకోలేక, ఊరిలో ఉండలేక మూడు నెలల బిడ్డను తీసుకుని కరీంనగర్ జిల్లా కేంద్రానికి చేరుకుని వంట మాస్టర్ వెంకన్న దగ్గర సహాయకురాలిగా చేరింది. వంట చేయగల నైపుణ్యం నేర్చుకున్న అనంతరం స్వయంగా మహిళలతో బృందంగా ఏర్పడి శుభ కార్యాలకు, రాజకీయ పార్టీల సమావేశాలకు వంటలు చేస్తున్నది. 20 వేల మంది వరకు కూడా క్యాటరింగ్ అందించే స్థాయికి ఎదిగింది.

 బల్మూరి విజయసింహారావు, 

కరీంనగర్ (విజయక్రాంతి)

యాదమ్మ వంట రుచి చూసిన ప్రధాని మోదీ

ప్రధాని మోదీ యాదమ్మ వండిన వంట రుచి చూసి శెభాష్ అంటూ కితాబిచ్చారు. 2022లో హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి ప్రధాని మోదీ హాజరుకాగా అప్పుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపీ బండి సంజయ్ కుమార్ ఉన్నారు. బండి సంజయ్ అతిథులకు వంట చేసేందుకు కరీంనగర్‌కు చెందిన యాదమ్మను ఎంపిక చేశారు. ప్రధాని మోదీతోపాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనేతలు తెలంగాణ వంటకాలను రుచిచూశారు.

ప్రత్యేకంగా చేసిన పులిహోరా, దద్దోజనం, బగారా రైస్, గుత్తి వంకాయ, పచ్చి పులుసు, గంగావాయిలి కూర పప్పు, సాంబార్ రుచులను మెచ్చుకున్నారు. ఇవేకాదు యాదమ్మ శాకాహారంతోపాటు మాంసాహార వంటలు కూడా పలువురి కితాబును అందుకున్నాయి. గత ప్రభుత్వంలో బీఆర్‌ఎస్ నిర్వహించిన సమావేశాల్లో యాదమ్మ వండిన నాటుకోడి రుచులు కేసీఆర్‌తోపాటు పార్టీ నాయకుల మన్ననలు పొందాయి. యాదమ్మ వంటలతోపాటు పిండివంటలైన గారెలు, సకినాలు, అరిసెలు, పాయసం, సర్వపిండి, భక్ష్యాలు కూడా తయారు చేస్తుంటారు.

కష్టమే నన్ను ఇక్కడి వరకు తీసుకువచ్చింది

కడుపునిండితే చాలన్న ఆశతో కరీంనగర్ వచ్చి నిరంతరం కష్టపడ్డా. ఆ కష్టమే నన్ను ఇక్కడి వరకు తీసుకువచ్చింది. ప్రధాని మోదీతోపాటు మాజీ సీఎం కేసీఆర్, ఎందరో ప్రముఖులు నా వంటలు రుచిచూసి అభి నందించడం సంతోషంగా ఉంది. నా కొడుకును చదివించుకోగలిగాను, ఇ ల్లు కట్టుకున్నాను, 50 మంది వరకు ఉపాధి కల్పిస్తున్నాను. ఇదంతా అం దరి సహకారంతోనే సాధ్యమయింది.

 - గూళ్ల యాదమ్మ