calender_icon.png 13 August, 2025 | 6:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యమ బావుటా సాక్షిగా!

21-06-2024 12:00:00 AM

నేడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ వర్ధంతి

ఏ కార్యంలో అయినా సరే, ఇంకా అసాధ్యం అనిపించే దీర్ఘకాలిక పోరాటాలలో అయితే, విజయం సాధించడానికి సుస్పష్టమైన, అత్యంత పటిష్టమైన ప్రణాళిక, తిరుగులేని శక్తి సామర్థ్యాలు తప్పనిసరి. ఇవి పుష్కలంగా ఉన్నప్పటికీ ఒక్కోసారి అంతిమ విజయం మన సొం తం కాదు. కారణం, వీటితోపాటు ఉండాల్సిన మరో ఆయుధం లేకపోవడమే. అదే చెక్కు చెదరని ‘ఉక్కు సంకల్పం’. ప్రజాస్వామిక, అహింసామార్గమూ ‘యుద్ధమే’ కను క, నిల్చున్న దారిలోంచి ఒక్క అడుగైనా పక్కకు జరక్కుండా స్థిరంగా ఉండగల ఇనుప ఖనిజం వంటి ‘నిబద్ధత’ ఉండాలి. అప్పుడు లక్ష్యం మన ముందు తలొంచి తీరుతుంది. 

ఇంతటి ధీశాలులు ఎందరుంటే అంత వేగవంతంగా ఫలితాన్ని చవిచూ స్తాం. అప్పుడే పదేళ్ల విజయ చరిత్రను మూట గట్టుకున్న తెలంగాణ సుదీర్ఘ ఉద్య మ నేపథ్యంలో వేళ్లపైన లెక్కించగల అతికొద్ది మంది ఇలాంటి దృఢయోధులలో ఒకరు ఆచార్య కొత్తపల్లి జయశంకర్. ఆయన ‘మహాసంకల్పం’ ఎంత గొప్పదం టే, యావత్ జీవితాన్ని రాష్ట్రసాధనకే పూర్తి నిజాయితీగా ధారపోశారు. ‘ఇంతటి మహాను భావుడు మన కళ్లముందు నడయాడితే మనం గుర్తించలేక పోయామా?’ అని కొత్తతరం వలవల ఏడ్చేంతటి విలువైన, ఘనమైన జీవితం ఆయనది. 

తెలంగాణ కోసం తపించిన ధన్యజీవి

‘మహాభారతాని’కి భీష్మాచార్యుని వలె మలిదశ ‘తెలంగాణ ఉద్యమాని’కి బ్రహ్మచర్య దీక్షాదక్షుడైన జయశంకర్ ఆచార్యులు లభించారన్నది నిజం. దేశ స్వాతంత్య్రానికి ముందు జన్మించి, ఆనాటి స్ఫూర్తిని సం పూర్ణంగా పుణికి పుచ్చుకొని, అంతే పట్టుదలతో, అదే చిత్తశుద్ధితో కోట్లాది తెలంగా ణ బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం తపించిన ధన్యజీవి. ఆయనే కనుక లేకపోతే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన పోరాటం ఎటు వెళ్లేది? ఏమయ్యేది? 2011 జూన్ 21న క్యాన్సర్ మహమ్మారి బారిన పడి వారి ప్రాణాలు పోకుండా ఒక్క మూడేళ్లు ఆగివుంటే, ఆయన తన జీవిత కాల స్వప్నా న్ని వీక్షించగలిగేవారే. ‘రాష్ట్ర ఏర్పాటును కళ్లారా చూడాలి. ఆ తర్వాతే చనిపోవాలి’ అన్న తన ఆఖరి కోర్కె నిజమైన వేళ, ఆయ న రాల్చే ఆనందభాష్పాలు చూస్తే బావుండేదని యావత్ తెలంగాణ ఎంతగా తపిం చిందో. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎవరి పాత్ర వారిదే కావచ్చు. కానీ, కొత్తపల్లి వారి భాగస్వామ్యం మాత్రం అవిస్మరణీయం.

పద్దెనిమిదేళ్ల వయసులో వరంగల్‌లో డిగ్రీ కాలేజీ స్థాపన కోసం నినదించిన క్షణాలనుంచి మలిదశ ఉద్యమానికి స్ఫూర్తి ని, కొత్త ఊపును ఇచ్చేవరకు జయశంకర్ వారి జీవితమంతా ఎలాంటి కల్మషానికి తావులేని స్పటికం వంటిదే. 1934 ఆగస్టు 6న వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేట ఆయనకు జన్మనిచ్చిన పుణ్యగ్రామం. పుట్టి పెరిగిన నేల విలువను, అభం శుభం తెలియని ఇక్కడి మనుషుల ప్రేమను, మొత్తంగా తెలంగాణ ఆత్మను, తత్వాన్ని, మానవీయతను అణువణువు నా నింపుకున్న ప్రాణం ఆయనది. టీనేజ్ వయసు నాటికే మెల్లగా చాపకింద నీరు లా పాకుతూ, వేళ్లూనుకొని, పెచ్చుమీరిన సీమాంధ్ర వలసవాద పోకడలను ఎదిరించడానికి తాను ఏ మాత్రం వెనుకంజ వేయలేదు.పోలీస్ యాక్షన్ అనంతర పౌరపాలనతో ప్రాంతేతరుల ఆధిపత్యం మొద లైన ఫలితంగా ప్రజల జీవన సంస్కృతి విచ్ఛిన్నమవుతూ వచ్చిన దృశ్యాలు ఆయ న మదిలో సుస్థిరమవుతూ వచ్చాయి. 

తాత్త్విక పునాదికి మూలం

అటు వ్యక్తిగత, ఇటు వృత్తిపర జీవితం లో ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా జయశంకర్ సర్ తన నిఖార్సయిన నిబద్ధతను వీడలేదు. బ్రహ్మచర్య వ్రతాన్ని ఎంత పవిత్రంగా ఆచరించారో అంతే నిజాయితీగా తెలంగాణ వాదాన్ని తన భుజాన మోశా రు. అలా, చిన్నతనంలో, యుక్తవయసు లో, ఉద్యోగ బాధ్యతల సమయంలో అలవడుతూ వచ్చిన ప్రాంతీయతా అభిమా నం పరిపక్వతకు చేరి, వారిలో ఒక తాత్త్విక పునాదిని ఏర్పరిచింది. మాటలు, ప్రవర్తన, జీవన విధానం, అలవాట్లు, పోకడలనుబట్టి మన వ్యక్తిత్వపు గొప్పతనాన్ని అంచ నా వేసుకోవచ్చు. జయశంకర్ సర్ జీవిం చి వున్న కాలంలో ఆయనతో సన్నిహితంగా మెలగిన వారు, ఇంకా తాను స్వయంగా వ్యక్తపరిచిన అభిప్రాయాలు అన్నింటినీ లోతుగా గమనిస్తే తెలంగాణ ప్రాంతం, ప్రజలు, స్వభావం, తత్తం పట్ల వారిలోని చెక్కుచెదరని ఆకాంక్ష, ప్రబలమైన చిత్తశుద్ధి తెలుస్తాయి. 

ఆయన సమస్త జీవితం తెలంగాణ చుట్టూనే తిరిగిందన్నది వాస్తవం. తాను బతికిందే తెలంగాణ కోసం. తాను గట్టిగా నిలబడిందీ తెలంగాణ కోసమే. విద్యార్థి దశ నుంచి విశ్వవిద్యాలయ వీసీ వరకు, ఆర్థిక తత్వవేత్త నుంచి తెలంగాణ సిద్ధాంతకర్త వరకు కొత్తపల్లి వారిలో ఎక్కడా స్వార్థ, సంకుచిత పోకడలు కానరావు. ఆయన్ను చూసి అందరూ నేర్చుకోవాల్సిందే తప్ప, ఒకరి చేత తప్పు పట్టించుకు నే స్థితి తాను ఎప్పుడూ తెచ్చుకోలేదు.

ఒక సామాన్యునిలోని గొప్పతనం

జయశంకర్ సర్ వ్యక్తిత్వం ఎంత గొప్ప దో అర్థం చేసుకోవడానికి అనేక సందర్భాలను ఉదాహరణలుగా చెప్పవచ్చు. తాను ఏనాడూ, ఆర్భాటాలకు, గొప్పతనాలకు పోలేదు. తెలంగాణకుగాని, టీఆర్‌ఎస్‌కుగాని ‘సిద్ధాంత కర్త’గా తనను పిలవడాన్ని కూడా ఆయన అంగీకరించలేదు. బాహాటంగానే ఇలాంటివి తనకు ఇష్టం వుండ వని చెప్పారు. సాక్షాత్తు కేసీఆర్ తన కాళ్లకు దండం పెట్టడాన్ని సైతం ఆయన నివారించారు. ఆయన పదవుల కోసం ఏనాడూ పాకులాడింది లేదు. పదవులే ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి. ఇందుకు ఉదాహరణగా యూపీఏ హయాంలో వలచి వచ్చిన ‘నేషనల్ కమిషనర్ ఫర్ ఎంటర్‌ప్రైజెస్ ఫర్ రూరల్ ఆర్గనైజేషన్’ సభ్యుడి పదవిని పేర్కొనాలి. “అదికూడా తెలంగాణ ప్రయోజనాలకు అడ్డు రాకపోతేనే నేను ఆ పదవిలోనే కొనసాగుతాను” అని షరతు విధించి, మరీ అందులో చేరినట్లు చెప్పారు. 

1953లో జయశంకర్ యువకుడిగా ఇంటర్‌మీడియట్ చదివిన వేళ వరంగల్‌లో డిగ్రీ కాలేజీ లేదు. ఆ కళాశాల స్థాప న కోసం అప్పట్లో జరిగిన ఆందోళనలో భాగంగా ‘మాకు యూనివర్సిటీ కావాలి’ అంటూ తన నోటినుంచి వచ్చిన నినాదం తర్వాతి కాలంలో నిజం కావడం యాదృచ్ఛికమైనా విశేషమనే చెప్పాలి. ముప్పయే ళ్ల తర్వాత ఆయన నోటి వాక్కు ఫలించి వరంగల్‌లో యూనివర్సిటీ ఏర్పాటైంది. ఆయన అదే విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్స్‌లర్ సైతం అయ్యారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం అంటే ఆయనకు ఎనలే ని అభిమానం. దానిని తలచుకుంటేనే తన ఛాతీ గర్వంతో ఉప్పొంగుతుందని చెప్పేవారు. ఎన్నెన్ని పోరాటలకు, ఆరాటాలకు అది వేదిక కావడాన్ని ఆయన ఏనాడూ మరిచిపోలేదు. ఈ పదేళ్ల తెలంగాణ స్వరాష్ట్రంలో జయశంకర్ వంటి నిష్కామ యో గులు లేని లోటు స్పష్టంగా కనిపిస్తున్నది. 

దేశానికి మహాత్ముని వలె తెలంగాణ ఉద్యమ విజయానికి కొత్తపల్లి వంటివారు భౌతికంగా దూరమైనా, ఆత్మీయంగా దారిదీపాలై మనకు మార్గాన్వేషణ చేస్తూనే ఉంటారు. ఆయన ఎలాంటి తెలంగాణ కోసమైతే పరితపించారో, ఏ ప్రజల బాగు కోసమైతే అహరహం దీక్ష వహించారో అటువంటి సుసంపన్నమైన రాష్ట్ర సాధన దిశగా అందరం అడుగులు వేయాల్సి ఉంది. 

 దోర్బల బాలశేఖరశర్మ