27-08-2025 03:02:28 AM
ఘనంగా సత్కరించిన శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 26 (విజయక్రాంతి): దక్షిణ కొరియాలో జరిగిన ప్రతిష్టా త్మక 20వ ఆసియా రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఒక స్వర్ణం, రెండు రజత పతకాలు సాధించి భారతదేశానికి కీర్తి తీసుకువచ్చిన అంతర్జాతీయ ఆర్టిస్టిక్ రోలర్ స్కేటర్ పడిగ తేజేష్‌ను శ్రీశ్రీ హోలిస్టిక్ ఆసుపత్రులు ఘనంగా సత్కరించాయి. తేజేష్ ఇప్పటివరకు జాతీయ, అంతర్జా తీయ స్థాయిలో మొత్తం 179 పతకాలు సాధించడం విశేషం. వీటిలో 114 బంగారు, 42 వెండి, 23 కాంస్య పతకాలు ఉన్నాయి.
మంగళవారం సత్కార కార్యక్రమానికి శ్రీశ్రీ హోలిస్టిక్ ఆసుపత్రుల చైర్మన్, చీఫ్ కార్డియాలజిస్ట్ ప్రొఫెసర్ డాక్ట ర్ వి.ఎస్. రామచంద్ర, మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఆప్తాల్మాలజిస్ట్ డాక్టర్ తుశారా ఆలూరి హాజరయ్యారు. ఇద్దరూ తేజేష్ కృషి, క్రమశిక్షణ, ప్రతిభ ను అభినందిస్తూ, ఆయన విజయాలు యువతకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, “ పడిగ తేజేష్‌ను సత్కరించడం మా గర్వకారణం. అతని పట్టుదల, అంకితభావం భారతీయ క్రీడాస్ఫూర్తిని ప్రతిబింబిస్తోంది.
భవిష్యత్తులో అంతర్జాతీయ వేదికలపై మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం” అని అన్నారు. తేజేష్ తండ్రి బాల సుబ్రహ్మణ్యం పడిగ మాట్లాడుతూ.. “శ్రీశ్రీ హోలిస్టిక్ ఆసుపత్రులు ఇచ్చిన గుర్తింపు, ప్రోత్సాహం తేజేష్‌లో మరింత ఉత్సాహాన్ని పెంచింది. అతను ఒలింపిక్స్‌లో గోల్డ్ సాధించాలని మా కల” అని తెలిపారు.