20-01-2026 12:58:04 AM
పోటీకి దూరంగా మరి కొందరు
పక్క వార్డులే దిక్కా..?
అభ్యర్థుల ఎంపిక బిజీలో పార్టీలు
అధిష్టానం ప్రసన్నం కోసం ఆశావాహులు నానా తంటాలు
బెల్లంపల్లి, జనవరి 19: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రిజర్వేషన్ల తొలిఘట్టం ముగిసింది. ఇక అభ్యర్థుల ఎంపిక బిజీలో ప్రధాన పార్టీల తలమునకలవుతున్నారు. అంతకు ముందే ఆయా పార్టీలు సూత్రప్రాయంగా అభ్యర్థుల జాబితాను ఖరారు చేసుకున్నారు. అయితే రిజర్వేషన్లు జాబితాలను తలకిందులు చేశాయి. ఎన్నికల నోటిఫికేషన్ ఇప్పుడో అప్పు డో అనే టెన్షన్‌లో పార్టీలు పడిపోయారు. రిజర్వేషన్ ప్రకారం కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజే పీ, సీపీఐ ప్రధాన పార్టీల నుంచి టికెట్ ఆశించిన ఔత్సాహికుల ఆశలన్ని పటాపంచలయ్యాయి.
ఆశావహుల ఆశలన్నీ రిజర్వేషన్ తీరుతో అవిరైపోయాయి. 34 వార్డులలో ప్రస్తుత రిజర్వేషన్ల ప్రకారం పోటీ చేసే స్థానాలు మొత్తంగా తారుమారయ్యాయి. దీంతో ఆశావహులు సొంత వార్డుల చెయ్యి దాటిపోయాయి. గత్యంతరం లేక వలసలు పోయేందుకు ప్రణాలికలు చేస్తున్నారు. పక్క వార్డుల్లో పోటీచేసేందుకు ప్లాన్ కూడా అనుకూలించే పరిస్థితి కనిపించడం లేదు. ఆ వార్డుల్లో టికెట్ ఆశించే వారు పరాయి అభ్యర్థులను తీవ్రంగా వ్యతిరిస్తున్నారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాల్ని జారవిడిచుకోవడానికి వారు సిద్ధంగా లేరు.
ఈ రకంగా ఆశావహులై నా పెద్దలీడర్లకు మరో సారి ఆశాభంగం తప్పడం లేదు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ గెలుపు గుర్రాలను ఖరారు కోసం ముఖ్య లీడర్లను రంగంలో దింపారు. ఆ పనిలో పార్టీ ముఖ్యలీడర్లు బిజీగా ఉన్నారు. కొన్ని వార్డుల్లో అభ్యర్థుల కొరత ఉంది. ఈ పరిస్థితి అన్ని పార్టీలకు ఉంది. సమర్ధవంతమైన అభ్యర్థుల కోసం అన్ని పార్టీలు వేటలో ఉన్నారు. బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బలమైన అభ్యర్థులను పోటీలో నిలబెట్టాలని కసరత్తు చేస్తున్నారు. ముందస్తు జాబితా, ప్రస్తుత రిజర్వేషన్ తో పనికి రాకుండా పోయిందనీ సమా చారం. దీంతో అభ్యర్థుల కోసం మళ్లీ కసరత్తు మొదలుపెట్టారు. అన్ని ప్రధాన పార్టీలు ఆయా వార్డుల్లో అభ్యర్థుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి వార్డుల్లో అదృష్టం ఎవరిని వరిస్తుందో చెప్పలేం.
కౌన్సిలర్ అభ్యర్థిత్వం కోసం టికెట్ ఆశిస్తున్న సీనియర్ లీడర్లు కొందరు రిజర్వేషన్లు తిరగబడడంతో నిరాశలో కూరుకుపోయారు. ఈసారి పోటికే దూరం ఉండాల్సిన పరిస్థితిలోకి నెట్టబడ్డారు. అనూహ్యంగా ఈసారి చైర్ పర్సన్ మహిళకి కేటాయించడంతో రిజర్వేషన్ కలిసొచ్చిన వారు చైర్ పర్సన్ లక్ష్యంగా పోటీలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో టిక్కెట్ కోసం జోరుగా పైరవీలు చేస్తున్నారు. అధిష్టానం ప్రసన్నం కోసం ఆశావాహులు నానా తంటాలు పడుతున్నారు. ఎలాగైనా టికెట్ సంపాదించి చైర్ పర్సన్ పీఠం ఎక్కాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో కౌన్సిలర్‌గా టికెట్ సాధించడం ఒకెఎత్తయితే, చైర్ పర్సన్ పీఠాన్ని అధిరోహించడం మరో ఎత్తు అనే విషయం గెలిస్తే కానీ తెలుస్తుందని విశ్లేషకులు అంటున్నారు.
రూ.లక్షల అర్పిస్తేగానీ...
మెజార్టీ కోసం క్యాంపులు పెట్టి లక్షల రూపాయలు అర్పిస్తేగానీ కౌన్సిలర్ల మద్దతు అంత సులభంగా కూడగట్టడం కుదరదనేది జగమెరిగిన సత్యం. కాంగ్రెస్, బిఆ ర్‌ఎస్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. మెజార్టీ కౌన్సిలర్ స్థానాలను కైవసం చేసుకుని చైర్ పర్సన్ పీఠాన్ని సొంతం చేసుకోవాలని ఇరు ప్రధాన పార్టీలు టార్గెట్‌గా పెట్టుకున్నాయి. మొత్తానికి అయి తే మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక కసరత్తు పరిణామాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల వాతావరణం హాట్ హాట్‌గా మారింది.