09-02-2025 06:21:59 PM
మానవత్వం చాటుకున్న కుమార్..
మంచిర్యాల (విజయక్రాంతి): మంచిర్యాల పట్టణంలోని మార్కెట్ ఏరియాలో మతిస్థిమితం సరిగ్గా లేక నిస్సహాయ స్థితిలో రోడ్డు పక్కన పడి ఉన్న అనాధ వృద్దురాలి(70) కి అండగా నిలిచారు కల్వరి కుమార్. వివరాల్లోకి వెళ్తే... నాలుగు నెలల కిందట రోడ్డు పక్కన నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధురాలని చూసి బాటసారులు 108కు సమాచారం అందించగా సిబ్బంది మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె ఆసుపత్రిలో చేరి నాలుగు నెలలైనా ఆమె కోసం ఎవరూ రాకపోవడం, వృద్ధురాలినీ చూసుకునే వారు ఎవరు లేకపోవడంతో ఆసుపత్రిలోని రోగులు ఇబ్బందులు పడుతుండడంతో కల్వరి అనాధ ఆశ్రమ నిర్వాహకుడు కుమార్ కు ఆదివారం సమాచారం అందించారు.
మానసిక వైద్య నిపుణులు డాక్టర్ అజ్మీరా రాము నాయక్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హరీష్ చంద్ర రెడ్డి, ఆర్ యం ఓ డాక్టర్ శ్రీమన్నారాయణల సమక్షంలో అనాధ వృద్ధురాలిని ఆశ్రమానికి తరలించారు. అనాధలు, వృద్ధులు ఎవరైన కనిపిస్తే 97019 73636, 93810 18678 లకు సమాచారం ఇవ్వాలని కుమార్ కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నర్సింగ్ ఆఫిసర్ వజ్రాపు మార్గన్ ట్రోజీ, జూనియర్ నర్సింగ్ ఆఫిసర్ గ్రేసీ తదితరులు పాల్గొన్నారు.