calender_icon.png 14 October, 2025 | 3:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాబోయే టెక్నాలజీకి అనుగుణంగా ఏటీసీ ఏర్పాటు

14-10-2025 12:38:10 AM

-మంత్రి తుమ్మల

-టెక్నాలజీ సెంటర్ ను ప్రారంభం

-ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో  4 ఏ.టి.సి. సెంటర్లు ఏర్పాటు

ఖమ్మం, అక్టోబరు 13 (విజయక్రాంతి): రాబోయే టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులను సిద్దం చేసేలా ఏ.టి.సి. ని ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. సోమవారం ఖమ్మం నగరంలోని ప్రభుత్వ ఐటిఐ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన అడ్వానస్డ్ టెక్నాలజీ సెంటర్ ను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమీషనర్ సునీల్ దత్ లతో కలిసి మంత్రి తుమ్మల  సోమవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు దక్కాలంటే రొటీన్ గా ఉన్న ఐటిఐ కోర్సులు కాకుండా ప్రస్తుత పరిశ్రమల అవసరాల ప్రకారం నైపుణ్య కోర్సుల ను డిజైన్ చేయించి ఆధునిక సాంకేతిక కేంద్రాల ద్వారా అందించాలన్నారు. రాబో యే 5 నుంచి 10 సంవత్సరాల వరకు ప్రపంచీకరణలో జరిగే మార్పులకు అనుగుణంగా ఏటీసీ కోర్సులు డిజైన్ చేశామన్నారు.  ప్రపంచంలో మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా మన యువతను సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు. ఆధునిక సాంకేతిక కేంద్రంలో అందించే కోర్సులను పూర్తి చేసే ముందే విద్యార్థులకు ఉపాధి అవకాశాలు లభించేలా టాటా సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని అన్నారు.

యువతకు ప్రపంచంలో ఎక్కడైనా బ్రతికే శక్తి సామర్థ్యాలు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ కు ప్రాధాన్యత కల్పించారని అన్నారు. ప్రస్తుతం ఏసీ లకు చాలా డిమాండ్ ఉందని అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వైపు ప్రపంచం చూస్తుందని, దానికి సంబంధించిన మెకానిక్స్ లో మనం నిష్ణాతులం కావాలని మంత్రి అన్నారు.  నిరు ద్యోగ యువతకు మంచి నైపుణ్యాలు అందించాలని లక్ష్యంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో ఖమ్మం, మణుగూరు, భద్రాచలం, కొత్తగూడెం ప్రాంతాలలో 4 ఏ.టి.సి. లను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.  జిల్లాలో ఉన్న పరిశ్రమలకు అవసరమైన ఉపాధి ట్రైనింగ్ శిక్షణ విద్యార్థులకు అందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.

ఏటీసీ కేంద్రంలో ఉన్న కోర్సుల ద్వారా ప్రపంచంలో ఎటువంటి అవకాశాలు అందుబాటులో ఉంటాయో విద్యార్థులకు వివరించేలా డిస్ ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు. ఇంజనీరింగ్ కోర్సుల కన్నా మెరుగైన నైపుణ్య కోర్సులు ఏటిసిలో అందుబాటులో ఉన్నాయని, వీటిని విద్యార్థులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ అడ్వానస్డ్ టెక్నాలజీ సెంటర్ ను నేడు ప్రారంభం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని, భవిష్యత్తు పరిశ్రమల డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని ఏ.టి.సి. కోర్సులను ప్రభుత్వం డిజైన్ చేసిందని అన్నారు.

రంగారెడ్డి జిల్లాలో ఫాక్స్ కాన్ ఇయిర్ పాడ్స్ ఉత్పత్తి పరిశ్రమ ఉందని, మన ఏ.టీ.సి. లో రోబోటిక్స్ పూర్తిచేసే విద్యార్థులకు అటువంటి పరిశ్రమలో మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు.  ఏటీసి లో అందించే కోర్సులలో విద్యార్థులు నిష్ణాతులుగా తయారు కావాలని, మన దగ్గర సర్టిఫికెట్ ఉంటే ఉద్యోగాలు రావని నిజంగా నైపుణ్యం ఉన్నప్పుడు ఉపాధి అవకాశాలు అందుతాయని, దీనిని ప్రతి ఒక్క విద్యార్థి గుర్తు పెట్టుకోవాలని అన్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ కూడా సేవారంగం ప్రాధాన్యత నుంచి ఉత్పత్తి రంగం వైపు ప్రయాణం కొనసాగిస్తుందని కలెక్టర్ తెలిపారు. ప్రపంచానికి ఉత్పత్తి కేంద్రంగా భారతదేశం ఆవిర్భిస్తుందని, ఎప్పటికప్పుడు లభించే అవకాశాలను అందిపుచ్చుకునేలా మనం తయారు కావాలని కలెక్టర్ సూచించారు.

కార్యక్రమంలో సునీల్ దత్ మాట్లాడుతూ దేశంలో స్కిల్ గ్యాప్ బాగా ఉందని, విద్యార్థులు చేసే కోర్సులకు, బయట పరిశ్రమల అవసరాలకు చాలా  తేడాలు ఉన్నాయని గమనించిన ప్రభుత్వం ప్రైవేటు సంస్థలతో సమన్వయం చేసుకుంటూ ఏటీసీ సెంటర్ లను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి మన రాష్ట్రంలో పెరుగుతుందని, ఈ రంగం వైపు యువత దృష్టి సారించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, ఏటిసి ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, విద్యుత్ శాఖ ఎస్‌ఇ శ్రీనివాస చారి, ఆర్ అండ్ బి ఎస్‌ఇ యాకోబు, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, కార్మిక శాఖ సహాయ కమీషనర్ కృష్ణవేణి, స్థానిక కార్పొరేటర్ సత్యనారాయణ, ఖమ్మం అర్బన్ మండల తహసీల్దార్ సైదులు,  ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.