14-10-2025 12:38:11 AM
సిద్దిపేట జిల్లా ములుగు మండలం కొక్కొండ గ్రామంలో ఘటన
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
గజ్వేల్, అక్టోబర్ 13 : సిద్దిపేట జిల్లా ములుగు మండలం కొక్కొండ గ్రామంలో ఆదివారం ఓ మహిళ అనుమానాస్పదంగా ఉరి వేసుకొని మృతి చెందింది. ములుగు ఎస్త్స్ర విజయ్ కుమార్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కొక్కొండ గ్రామానికి చెందిన గుంటిపల్లి రవి గౌడ్ భార్య అశ్విని(26)లకు 2019 సంవత్సరంలో వివాహం జరిగింది. కాగా అశ్వినికి, ఆమె అత్త, మరిదితో తరచూ గొడవలు జరుగుతున్నాయి.
ఈ విషయం అశ్విని దౌల్తాబాద్ మండలం కోనాపూర్ గ్రామంలోని ఆమె తండ్రి తిప్పగాని మల్ల గౌడ్ కు చెబితే సర్దుకుపోవాలి అని సూచించాడు. కాగా ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో అశ్విని అత్తగారి ఇంటి పక్కన వారు అశ్విని ఉరివేసుకుని చనిపోయిందంటూ సమాచారం ఇచ్చారు. అశ్విని తండ్రి మల్ల గౌడ్ వారి కుటుంబ సభ్యులు కొక్కొండ గ్రామంలోని అశ్విని ఇంటికి చేరుకున్నారు.
అక్కడ అశ్విని మృతదేహం మంచం మీద పడుకోబెట్టి ఉందని, చున్నీ మెడకు కట్టి ఉందని అశ్విని మృతి పట్ల ఆమె తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. కాగా గజ్వేల్ లో సోమవారం అశ్విని మృతదేహానికి ములుగు తహసిల్దార్ రవీందర్ రెడ్డి , ఎస్త్స్ర విజయ్ కుమార్ సమక్షంలో వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. అశ్విని తండ్రి మల్ల గౌడ్ ఫిర్యాదు మేరకు ములుగు ఎస్త్స్ర విజయ్ కుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.