18-09-2025 10:51:01 PM
విద్యార్థిని చితకబాదిన గడ్డి అన్నారం క్యాంపస్ ఇన్ చార్జి
ఎల్బీనగర్: విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పి, సన్మార్గంలో నడిపించాల్సిన అధ్యాపకులు విచక్షణ మరిచి, విద్యార్థులను చితకబాదారు. గడ్డి అన్నారంలోని నారాయణ జూనియర్ కాలేజీ(Narayana Junior Colleges)లో దారుణం జరిగింది. అధ్యాపకులు దాడి చేయడంతో ఒక విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు గురువారం కళాశాలకు చేరుకుని యాజమాన్యాన్ని నిలదీశారు. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ఈ నెల 15న మధ్యాహ్నం 3 గంటల సమయంలో గొడవపడ్డారు. గొడవపడ్డ విద్యార్థులకు సర్ది చెప్పాల్సిన ఫ్లోర్ ఇన్ చార్జి సతీశ్ సహనం కోల్పోయి వారిద్దరినీ తీవ్రంగా కొట్టి గాయపరిచాడు. ఈ ఘటనలో సాయిపునీత్ అనే విద్యార్థికి దవడకు గాయమై ఎముక విరిగింది. గాయపడిన విద్యార్థి సాయిపునీత్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మలక్ పేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను విచారించిన పోలీసులు దాడికి పాల్పడిన ఫ్లోర్ ఇన్ చార్జి సతీశ్ పై కేసు నమోదు చేశారు.