07-10-2025 12:56:32 AM
-రాగిముద్దలో బొద్దింక ప్రత్యక్షం
-నానక్‌రామ్‌గూడ రెస్టారెంట్‌లో ఘటన
-ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 6 (విజయక్రాంతి ):నగరంలోని రెస్టారెంట్లలో ఆహార భద్రత, పరిశుభ్రత మరోసారి ప్రశ్నార్థకంగా మారాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎన్ని దాడులు చేస్తున్నా, నిర్వాహకుల తీరు మారడం లేదు. తాజాగా, హైదరాబాద్‌లోని ప్రముఖ కృతుంగ రెస్టారెంట్‌లో ఓ వినియోగదారుడికి భయానక అనుభవం ఎదురైంది. తాను ఆర్డర్ చేసుకున్న రాగిముద్దలో చచ్చిపోయిన బొద్దింక రావడంతో ఆయన తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.వివరాల్లోకి వెళితే..నగరంలోని నానక్‌రామ్ గూడలో ఉన్న కృతుంగ హోటల్‌కు వెళ్లిన ఓ వినియోగదారుడు రాగిముద్ద ఆర్డర్ చేశారు.
పార్శిల్ వచ్చిన తర్వాత తినడం మొదలుపెట్టగా, అందులో బొద్దింక కనిపించడంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు. వెంటనే తేరుకుని, హోటల్ నిర్వాహకులను నిలదీశారు. వారి నుంచి సరైన స్పందన రాకపోవడంతో, ఈ విషయాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి, ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు.ఇటీవల కాలంలో నగరంలోని అనేక ప్రముఖ హోటళ్లలోనూ ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిపిన తనిఖీల్లో బూజు పట్టిన, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు బయటపడుతున్న విషయం తెలిసిందే. కనీస పరిశుభ్రతా ప్రమాణాలు పాటించకుండా, వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఇలాంటి హోటళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు. ఈ ఫిర్యాదుపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో, సదరు హోటల్‌పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో అని వేచి చూడాలి అంటున్నారు నగరవాసులు.