03-11-2025 02:36:42 AM
చేవెళ్ల, నవంబర్ 2: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ముడిమ్యాల, మొయినాబాద్ మండలం తొల్కట్ట గ్రామాల్లోని ఫామ్ హౌస్‌లపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. రాజేంద్రనగర్ జోన్ డీసీపీ యోగేష్ గౌతమ్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి 11 గంటలు దాటిన తర్వాత పోలీసులు ముడిమ్యాల, తొల్కట్ట పరిధిలో 39 ఫామ్ హౌస్‌లను తనిఖీ చేశారు. ఈ సమయంలో తొల్కట్ట గ్రామంలోని అజీముద్దీన్ ఫామ్ హౌస్‌లో హుక్కా, ప్రణవ విల్లా హిల్స్‌లో 18 బీర్లు, ఒక విస్కీ బాటిల్ స్వాధీనం చేసుకున్నారు.
మరో అనధికారిక టికెట్ ఈవెంట్ లో 29 మంది మహిళలు, పురుషులు సౌండ్ సిస్టంతో డ్యాన్సులు చేస్తుండగా పట్టుకున్నారు. వీరి వద్ద వివిధ బ్రాండ్ల విస్కీ, రమ్, వోడ్కా, వైన్, బ్రీజర్ల బాటిల్స్ గుర్తించారు. డ్రగ్ టెస్ట్ నిర్వహించగా ఎవరికీ పాజిటివ్ రాలేదు. ముడి మ్యాల గ్రామంలో ఒక వాహనంలో హుక్కా గుర్తించి సీజ్ చేశారు. రితికా ఫామ్ హౌస్‌కు స్లేట్ స్కూల్ పిల్లలు సుమారు 150 మంది (బాలురు, బాలికలు) 10 స్కూల్ బస్సుల్లో వచ్చి సౌండ్ సిస్టమ్‌తో నృత్యాలు చేస్తున్నారు.
కొందరు అనధికారికంగా మద్యం తాగుతుండగా పట్టుకున్నారు. నిర్వాహకులతో పాటు ఫామ్‌హౌస్ యజమానులపై 4 కేసులు నమోదు చేసినట్లు డీసీపీ తెలిపారు. ఇదే సమయంలో బీజాపూర్ హైవేపై తోల్కట్ట వద్ద 2 బృందాలతో వాహన తనిఖీలు నిర్వహించారు. 3 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేసి.. వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.