04-11-2025 01:11:47 AM
							రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’. బలమైన, భావోద్వేగభరితమైన ఓ ప్రేమకథతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. గీతాఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 7న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుండగా, ఇదే నెల 14న తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ ప్రపంచవ్యాప్తంగా థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో హీరో దీక్షిత్ శెట్టి చిత్ర విశేషాలను పంచుకున్నారు.
నాకు ‘దసరా’ సినిమా తర్వాత వచ్చిన అవకాశమిది. ఈ చిత్రంలో రష్మికకు బాయ్‌ఫ్రెండ్ క్యారెక్టర్‌కు నేను బాగుంటానని దర్శకుడు రాహుల్ నిర్ణయించుకున్నారు. స్క్రిప్ట్ చదివాక నన్ను ఈ రోల్ కోసం ఎందుకు అనుకుంటున్నారో నాకూ అర్థమైంది. అందుకే తప్పకుండా చేయాలనుకున్నా. నేను తెలుగు, తమిళ, మల యాళంలో స్క్రిప్ట్స్ వింటుంటా. ఇలాంటి స్క్రిప్టులు చాలా అరుదుగా వస్తుంటాయి.
ప్రేమకథను ఈ సినిమా మరో కోణంలో చూపిస్తుంది. ఇందులోని పాత్రలు, సందర్భాలు మన జీవితంతో పోల్చుకునేలా ఉంటాయి. 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న యువత ఈ సినిమా నుంచి కొన్ని విషయాలు నేర్చుకుంటారు. కుటుంబ ప్రేక్షకులకు కూడా బాగా నచ్చుతుంది.
ట్రైలర్ చూసి అందరూ విక్రమ్ టాక్సిక్ బాయ్‌ఫ్రెండ్ అనుకుంటున్నారు. కానీ, ఇది నెగిటివ్ క్యారెక్టర్ అని ఎప్పుడూ ఫీల్ కావొద్దని రాహుల్ చెప్పేవారు. టాక్సిక్ బాయ్‌ఫ్రెండ్ అంటే స్మోకింగ్, డ్రింకింగ్, యాంగర్ ఇష్యూస్ ఉంటాయని చాలా సినిమాల్లో చూస్తుంటాం. కానీ, టాక్సిక్ బాయ్‌ఫ్రెండ్ అంటే వేరే ఇష్యూస్ కూడా ఉండొచ్చు. అలాంటి ఒక అంశాన్ని మా సినిమాలో చూస్తారు.
విక్రమ్ అనేక లేయర్స్ ఉన్న పాత్ర. నేను స్టేజ్, ఫిలిం స్కూల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి ఈ క్యారెక్టర్‌కు తగ్గట్టు సన్నద్ధమయ్యా ను. విక్రమ్ పాత్ర గురించి డైరెక్టర్‌కు చాలా క్లారిటీ ఉంది. అందుకే నాకు నటించడం సులువైంది.
‘ది గర్ల్‌ఫ్రెండ్’ లాంటి సినిమా కొన్నేళ్ల కిందట తాను చూసి ఉంటే తన జీవితం పట్ల తన దృక్పథం మరోలా ఉండేదని రష్మిక ఇటీవల ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఆమె నటన చూసిన తర్వాత ఈ సినిమాకు మరో నాయిక న్యాయం చేయలేదేమో అనిపించింది. ఆమెతో కలిసి నటిస్తున్నప్పుడు ఒక స్టార్‌తో ఉన్నామనే ఫీల్ కలగలేదు. తను యూనిట్ అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉండేది.
ఈ సినిమా షూటింగ్ టైమ్ లో అల్లు అరవింద్ ఓసారి నన్ను పిలిచారు. నేను సరిగ్గా నటించడం లేదేమో, ఏమంటారో అని వెళ్లా. కానీ ఆయ న అభినందించి, తర్వాతి సినిమాకు అడ్వాన్స్ ఇచ్చారు. సుదీర్ఘ అనుభవం ఉన్న అలాంటి గొప్ప నిర్మాత ప్రశంసలు కెరీర్ బిగినింగ్‌లో ఉన్న నాకు ఎంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చాయి.
ఈ సినిమా నా కెరీర్‌లో చేసిన బెస్ట్ ఫిలిం అని చెప్పగలను. నటుడిగా వైవిధ్యమైన పాత్రల్లో నటించాలని ఉంది. నేను కన్నడలో చేసిన ‘బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి’ సినిమాను తెలుగులో ఈ నెల 21న విడుదల చేయబోతున్నాం. తెలుగులో ‘షబనా’ అనే సినిమా చేస్తున్నా. మరో చిత్రం ‘కేజేక్యూ’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. టైటిల్ ఖరారు కాని ఇంకో ప్రాజెక్టులోనూ నటిస్తున్నా. కన్నడలో శివన్నతో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నా. మలయాళంలో చేస్తున్న ‘ఏంజెల్ నెం.16’ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. తమిళంలో కూడా ఒక సినిమా షూటింగ్‌లో ఉంది.