04-11-2025 01:09:47 AM
							-డీఏ, పీఆర్సీ సాధన, సీపీఎస్ రద్దుపై ఉద్యమం
-కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు కార్యాచరణ
-వేర్వేరుగా ఉపాధ్యాయులు, పెన్షనర్లు, ఉద్యోగుల దీక్షలు
-కదంతొక్కనున్న పీఆర్టీయూ, ఎన్‌ఎంఓపీఎస్ పెన్షనర్ల జేఏసీ
హైదరాబాద్, నవంబర్ 3 (విజయక్రాంతి): టీచర్లు, ప్రభుత్వ పెన్షనర్లు, సీపీఎస్ ఉద్యోగులు తమ హక్కులు, బకాయిలు, పీఆర్సీ సాధించుకునేందుకు పోరుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రప్రభుత్వం తమకిచ్చిన హామీలను తుంగలో తొక్కిందని, తమ డిమాండ్ల సాధనకు ఇక ఉద్యమ బాటే సరైనదని భావిస్తున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని, లేదంటే పోరు తప్పదని ఉపాధ్యాయ సంఘాల్లో ఒకటైన తెలంగాణ పీఆర్టీయూ ఇప్పటికే అల్టిమేటం జారీ చేసింది.
అందుకు డిసెంబర్ 9వ తేదీని డెడ్‌లైన్ విధించింది. ఈహెచ్‌ఎస్ స్కీం అమలు చేయాలనే డిమాం డ్‌తో తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యం లో ఈనెల 11న అన్ని జిల్లాలో నిరాహార దీక్షలు చేపట్టనుంది. అలాగే పెన్ష నర్ల జేఏసీ సైతం తమ బెనిఫిట్స్ సాధ న కోసం పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులతో కలిసి 17న ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నది.
కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని నేషనల్ మూమెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం (ఎన్‌ఎంఓపీఎస్) 25న ‘చలో ఢిల్లీ’కి పిలుపునిచ్చింది. అదే బాటలో మరికొన్ని టీచర్ సంఘాలు ఉద్యమ బాట పట్టనున్నాయి. వీరి నిరసనలు, దీక్షలతో నవంబర్, డిసెంబర్ మాసాలు హోరెత్తనున్నాయి.
పీఆర్సీ, డీఏలు, ఈహెచ్‌ఎస్ స్కీం లాపతా
కేంద్ర ప్రభుత్వం ఒకవైపు 8వ పే కమిషన్ ప్రకటించి కేంద్ర ప్రభుత్వఉద్యోగులకు తీపికబురు అందిస్తుంటే, రాష్ట్రప్రభుత్వం మాత్రం తమకు మొండిచేయే చూపిస్తుందని ఉద్యోగులు, టీచర్లు వాపోతున్నారు. డీఏ బకాయిలు 2022 జూలై నుంచి (ఐదు డీఏలు) పెండింగ్‌లో ఉన్నాయని, అసలు పీఆర్సీ ఊసే ఎత్తడం లేదని మండిపడుతున్నారు. కనీసం దసరాకో, దీపావళికో ఒక డీఏ అయినా ఇవ్వాలని కోరినా స్పందన లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాము అధికారంలో కి వచ్చిన ఆరు నెలల్లో పీఆర్సీ ప్రకటిస్తామన్న కాంగ్రెస్ ఇప్పటివరకు దాని ఊసే ఎత్తడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పాత పీఆర్సీ గడువు ముగిసి రెండేళ్లవుతోంది. ఇప్పటివరకు కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అప్పగించలేదు. ఉద్యోగుల డిమాండ్ మేరకు ప్రభుత్వం 50 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలంటే రూ.10 వేల కోట్లు అవసరం. అలాగే రెండు డీఏలు ఇవ్వాలంటే కనీసం రూ.300 కోట్లు సమీకరించాల్సి ఉంది. రాష్ట్రప్రభుత్వం గతనెలలో ఉద్యోగులు, పెన్షనర్లకు రూ.721 కోట్ల పెండింగ్ బకాయిలు విడుదల చేసింది. ఈనెలలోనూ మరికొంత చెల్లించాల్సి ఉంది.
అదెప్పుడు విడుదలవుతుందో తెలియదు. అలాగే ఈహెచ్‌ఎస్ పథకం కింద ఆరోగ్య కార్డుల జారీ ఎప్పుడు జారీ అవుతాయో తెలియడం లేదు. కార్డుల్లేకపోవడంతో ఉద్యోగులు, పెన్షనర్లు ప్రస్తుతం వైద్యఖర్చులు సొంతంగా పెట్టుకుంటున్నారు. అలాగే సీపీఎస్ ఉద్యోగులకు ఓపీఎస్ స్కీంను అమలు చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన ప్రభుత్వం, ఆ హామీని నెరవేర్చాలని కోరుతున్నారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఈనెల 25న ఎన్‌ఓంపీఎస్ ఆధ్వర్యంలో బహిరంగ సభ జరుగనున్నది.