23-11-2025 12:00:00 AM
తప్పించుకుని.. బేగంపేట పోలీసులకు ఫిర్యాదు
హైదరాబాద్, సిటీ బ్యూరో నవంబర్ 22 (విజయక్రాంతి): విమానయాన రంగంలో పనిచేస్తున్న ఓ మహిళా పైలట్‌కు చేదు అనుభవం ఎదురైంది. తండ్రి వయసున్న తోటి పైలట్ ఆమెపై లైంగిక దాడికి యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పని నిమిత్తం బెంగళూరు వెళ్లిన సమయంలో ఈ దారుణం చోటుచేసుకుంది. బాధితురాలు ధైర్యంగా ప్రతిఘటించి, అక్కడి నుంచి తప్పించుకుని హైదరాబాద్ చేరుకుని పోలీసులను ఆశ్రయించారు.
ఇన్‌స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం..హైదరాబాద్‌లోని బేగంపేట కేంద్రంగా నడుస్తున్న ఓ ప్రముఖ ఏవియేషన్ సంస్థలో 26 ఏళ్ల యువతి కమర్షియల్ పైలట్‌గా విధులు నిర్వర్తిస్తోంది. అదే సంస్థలో రోహిత్ శరణ్ (60) సీనియర్ పైలట్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల సంస్థ పనిమీద వీరిద్దరూ కలిసి బెంగళూరు వెళ్లారు. అక్కడ వీరు బసచేసిన హోటల్‌లో, రోహిత్ శరణ్ యువతి గదిలోకి ప్రవేశించి ఆమెపై లైంగికదాడికి యత్నించాడు.
దీంతో తీవ్ర భయాందోళనకు గురైన బాధితురాలు, నిందితుడిని ప్రతిఘటించి ఆ గది నుంచి బయటపడింది. అనంతరం హైదరాబాద్‌కు చేరుకుని బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు శుక్రవారం రోహిత్ శరణ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఈ ఘటన బెంగళూరులోని హలసూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగినందున, కేసును తదుపరి దర్యాప్తు నిమిత్తం అక్కడికి బదిలీ చేసినట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు. 60 ఏళ్ల వయసులో తోటి ఉద్యోగిని పట్ల ఇలా ప్రవర్తించడంపై తోటి సిబ్బంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు.