calender_icon.png 4 August, 2025 | 3:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళ శీలానికి వేలం!

04-08-2025 01:04:05 AM

  1. డాక్టర్ల ముసుగులో కీచక పర్వం తండ్రి ఆర్‌ఎంపీ.. కొడుకు ఎంబీబీఎస్
  2. మత్తుమందు ఇచ్చి అత్యాచారం కేసు పెడితే డబ్బులిచ్చి సెటిల్మెంట్
  3. రూ.25 లక్షలకు కుదిర్చిన బేరం కీ రోల్ పోషించిన ఓ ప్రజాప్రతినిధి
  4. నల్లగొండలో ఆలస్యంగా వెలుగులోకి ఘటన

నల్లగొండ నిఘా విభాగం, ఆగస్టు 3( విజయక్రాంతి) : ఆపత్కాలంలో రక్షించాల్సిన వైద్యులే కీచకులయ్యారు. సొంత ఆస్పత్రిలో పనిచేసే మహిళా సిబ్బందిపై కన్నేశాడు. ఆమెకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశాడు. తీరా విషయం బయటకు పొక్కడంతో రూ.25 లక్షలకు బేరం కుదుర్చుకుని చేతులు దులిపేసుకున్నాడు. నల్లగొండ జిల్లా కేంద్రంలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఓ ఆస్పత్రిని గత కొంతకాలంగా నాగార్జునసాగర్ నియోజకవర్గానికి చెందిన ఓ వైద్యుడు నడిపిస్తున్నారు.

అయితే ఈ ఆస్పత్రి మొదటి నుంచి వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటూ వస్తోంది. ఇప్పటికే ఆ ఆస్పత్రి యాజమాని అయిన సదరు వైద్యుడిపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. అయితే సదరు వైద్యుడి తండ్రి సైతం ఓ ఆర్‌ఎంపీ డాక్టర్ కావడం.. గిరిజన జనాభా ఎక్కువగా ఉండే నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని ఓ పట్టణంలో సుదీర్ఘకాలంగా ఆర్‌ఎంపీ సేవలు అందించడం అతడికి అక్కడ మంచి పట్టు ఉంది.

అయితే దాన్ని ఆసరాగా చేసుకుని తన కుమారుడి చేత నల్లగొండ జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేటు ఆస్పత్రిని ఓపెన్ చేయించారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ సదరు కుమారుడి వ్యవహారానికి తోడు తండ్రి అరాచకపర్వం తోడవ్వడంతో సదరు ఆస్పత్రి ఎన్నో వివాదాల పుట్టగా మారింది. ఒక రకంగా చెప్పాలంటే.. సదరు ఆస్పత్రి ఆబార్షన్లు చేయించేందుకు కేరాఫ్ అడ్రస్ అనేది బహిరంగ రహస్యమే. 

కొన్ని నెలలుగా సాగుతున్న అరాచకం..

ఈ క్రమంలోనే ఓ మహిళా సదరు ఆస్పత్రిలో పనిచేస్తోంది. ఆ మహిళ సైతం నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని ఓ పట్టణానికి చెందినది కావడం గమనార్హం. ఆస్పత్రిలో పనిచేసే క్రమంలో ఎంబీబీఎస్ డాక్టర్ అయిన కొడుకు సదరు మహిళకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశారు.

అయితే ఇది గత కొద్ది రోజుల క్రితమే జరిగింది. ఆ ఘటన నుంచి తేరుకున్న మహిళా అత్యాచారం విషయంపై సదరు వైద్యుడిని నిలదీయడంతో మాయమాటలు చెప్పి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. విషయం ఆర్‌ఎంపీ అయిన వైద్యుడి తండ్రి వరకు వెళ్లింది.

అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. సదరు ఆర్‌ఎంపీ సైతం ఆ మహిళను లైంగికంగా వేధించడం కొసమెరుపు. గత కొద్దిరోజులుగా ఈ తంతు నడుస్తున్న మహిళ భయంతో బయటకు విషయం చెప్పలేదు. అయితే ఇటీవల ఆ మహిళ గర్భవతి కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

పోలీసు స్టేషన్లో మహిళా కంప్లైంట్..

ఈ వ్యవహారం సదరు మహిళ తన తండ్రికి చెప్పడంతో సదరు వైద్యుడిపై నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఓ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే ఆ ఫిర్యాదును వెనక్కి తీసుకునేందుకు ఓ ఇద్దరు ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగారు. నాగార్జునసాగర్కు చెందిన లీడర్తో పాటు నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి సదరు మహిళతో పాటు తండ్రిని మాట్లాడి.. మహిళా శీలానికి రూ.25 లక్షలు వెల కట్టారు.

ఓ మహిళకు అన్యాయం జరిగితే ఆదుకోవాల్సిన ప్రజాప్రతినిధులు నిర్మోహమాటంగా రూ.25 లక్షలకు డీల్ కుదర్చడం కొసమెరుపు. అయితే ఆ మహిళకు ముందస్తుగా రూ.5 లక్షలు చెల్లించారు. కేసు వాపస్ తీసుకోగానే మరో రూ.20 లక్షలు ముట్టజెప్పాల్సి ఉంది. అయితే ఈ విషయం బయటకు రావడంతో ఆర్‌ఎంపీ తండ్రి, ఎంబీబీఎస్ కొడుకు ఇద్దరూ కలిసి హైదరాబాద్కు మకాం మార్చినట్టు తెలిసింది.

ఓ మహిళ పట్ల ఇంత కర్కశంగా తండ్రీకొడుకులు వ్యవహరించడం.. అదీకూడా ఇద్దరు పవిత్రమైన వైద్యవృత్తిలో ఉండి ఇలా చేయడం స్థానిక వైద్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.