calender_icon.png 4 August, 2025 | 5:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూబ్లీహిల్స్‌లో గులాబీ వ్యూహాలు

04-08-2025 01:23:23 AM

  1. ఉప ఎన్నికలో విజయానికి బీఆర్‌ఎస్ ప్రణాళికలు

నియోజకవర్గంలో కీలకంగా మైనార్టీలు

ముస్లిం ఓటర్లపై ప్రత్యేక దృష్టి

కేసీఆర్‌తో రెండు సభలు పెట్టేలా ప్లాన్

హైదరాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): త్వరలో ఉప ఎన్నిక జరిగే జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్‌ఎస్‌కు సిట్టింగ్ సీటు కావడంతో ప్రతిష్టాత్మకంగా మారింది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలిచేందుకు గులాబీ పార్టీ తన వ్యూహాలకు పదును పెట్టాల్సి ఉంటుంది.  ఇక్కడి నుంచి 2018, 2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరుఫున దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో గణనీయంగా సీట్లు గెలవడంతో గులాబీ పార్టీకి రాబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలవడం అనివార్యంగా మారినట్లుం ది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న ఆరు డివిజన్లు ఉన్నాయి. వాటిలో రహ్మత్ నగర్, వెంగళరావు నగర్, షేక్‌పేట, బోరబండ, యూసుఫ్ గూడ, ఎర్రగడ్డలున్నాయి. 

 ముస్లింలు ఎవరికి ఓటేస్తే వారే..

 నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ముస్లిం మైనార్లీ ఓటర్లున్నారు. వారే విజయావకా శాలను ప్రభావితం చేస్తారని గత ఎన్నికల్లో ఓటింగ్ సరళిని పరిశీలిస్తే తెలుస్తోంది. దాదాపుగా 32 శాతానికి పైగా వారు న్నారు. 2014 ఎన్నికల్లో ఎంఐఎం తరుఫున పోటీ చేసిన నవీన్ యాదవ్ 41,656 ఓట్లు సాధించారు. దాదాపుగా 25.19శాతం ఓట్ల ను పొంది రెండో స్థానంలో నిలిచారు.

ఎం ఐఎం పార్టీ 2009 అసెంబ్లీ ఎన్నికల్లో 23.96 శాతం, 2014 పార్లమెంట్ ఎన్నికల్లో సైతం 19.6 శాతం ఓట్లను పొందింది. దీని తో రాబోయే ఉప ఎన్నికల్లో గెలిచేందుకు ముస్లిం ఓటర్లు కీలకం కావడంతో బీఆర్‌ఎస్ పార్టీ ఇప్పటికే ఆ ఓట్లపైన దృష్టి సారించింది. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుఫున పోటీ చేసిన అజారుద్దీన్‌కు 1,64,212 ఓట్లు వచ్చా యి.

కాగా, ప్రస్తుతం అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం పైన దృష్టి పెట్టింది. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ విసృతంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. సభలు, సమావేశాలను నిర్వహి స్తున్నారు. ఇటు బీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం ప్రణాళికలు రచిస్తోంది. ఎమ్మె ల్సీలు దాసోజు శ్రవణ్ కుమార్, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిలు డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యనేతలు, కార్యకర్తలతో సమావేశమవుతున్నారు. 

ముస్లిం నేతలకు కీలక బాధ్యతలు

గులాబీ పార్టీలోని ముస్లిం నేతలకు ఉప ఎన్నికల్లో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ కూడా నియోజకవర్గంలోని ముస్లిం నేతలు, కార్యకర్తలతో సమావేశమవుతున్నారు. ము స్లింలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, మంత్రి వర్గంలో ముస్లింలకు ప్రాధాన్యత లేదని ప్రసంగాల్లో నేతలు స్ప ష్టం చేస్తున్నారు.

కేసీఆర్ హయాంలో ము స్లింల సంక్షేమం కోసం చేపట్టిన పథకాలను వివరిస్తున్నారు. ఇటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ లు రెండు ఒక్కటేనని బీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనేందుకు రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నా యని గులాబీ నేతలు చెప్తున్నారు.

మాగంటి కుటుంబం నుంచే అభ్యర్థి 

నియోజకవర్గంలో పార్టీ తరుఫున అభ్యర్థి ఎంపికపై ఇప్పటికే పార్టీ అధిష్ఠానం ఓ నిర్ణయానికి వచ్చిందని సమాచారం. అభ్యర్థి ఎంపిక, నియోజకవర్గంలో ప్రజాభిప్రాయం సేకరణ కూడా చేపట్టినట్లుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మాగంటి కుటుంబీకుల నుంచే ఎన్నికల బరిలోకి దిగే అవకాశాలున్నట్లు కారు పార్టీ వర్గాలు అంటున్నాయి. దివంగత నేత మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత మాగంటి పేరు ప్రధానంగా వినిపిస్తోంది.

జూబ్లీహిల్స్ బై ఎలక్షన్‌లో విజయం సాధించడం ద్వారా క్యాడర్‌లో ఉత్సాహం నింపాలని గులాబీ పార్టీ కార్యాచరణ రూపొందించుకుంటోంది. క్షేత్ర స్థాయిలో ఇప్పటికే పార్టీ ముఖ్యులు పర్యటిస్తూ ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు.

కేసీఆర్‌తో రెండు భారీ సభలు

ఎన్నికల షెడ్యూల్ విడుదల కంటే ముందుగానే ప్రచార కార్యక్రమాలను డివిజన్ల వారీగా ఏర్పాటు చేసే ప్రణాళికలు కారు పార్టీ నేతలు రచిస్తున్నారు. ఇటు కేటీఆర్, హరీశ్ రావులు బై ఎలక్షన్ బాధ్యతలు తీసుకొని నియోజకవర్గంలో విస్తృతంగా పర్య టించేలా కార్యక్రమాలను రూపొందించే పనిలో కారు పార్టీ ఉన్నది. కేసీఆర్ కూడా నియోజకవర్గంలో ఒకటి, రెండు భారీ సభలు నిర్వహించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు అంటున్నాయి.

తెలంగాణ భవన్‌లో నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలు, కార్యకర్తల సమావేశాలు వీలైనన్ని ఎక్కువగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా పార్టీ నేతలు చెప్తున్నారు. దీనిలో భాగంగా ఆదివారం నిర్వహించిన కార్యకర్తల సమావేశం కేటీఆర్ పాల్గొన్నారు. రాబోయే ఉప ఎన్నికల్లో విజయం సాధించడం ఎంత ముఖ్య మో ఆయన వివరించారు.