20-05-2025 07:57:43 PM
లక్షేట్టిపేట (విజయక్రాంతి): మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల పెద్ద చెరువు కబ్జాలకు గురవుతుందని అధికార యంత్రాంగం కదిలింది. గత వారం 10 రోజుల్లో ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లను నిర్ధారణ కోసం ఇరిగేషన్ శాఖను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak) అప్రమత్తం చేసి, ఆదేశాలివ్వడంతో మంగళవారం చెరువు హద్దుల నిర్ధారణ పనులు ప్రారంభం అయ్యాయి. ఇరిగేషన్ ఏఈ ప్రణీత్ తెలిపిన వివరాల ప్రకారం... ఎఫ్టీఎల్ భౌతిక పెగ్ మార్కింగ్ పనులు చేపట్టి ప్రస్తుతం ఆయా హద్దులను నిర్ధారిస్తున్నామన్నారు.
డీజీపీఎస్ విధానంలో కో ఆర్డినేట్స్ ద్వారా హద్దులు గుర్తిస్తున్నామని తెలిపారు. రెవెన్యూ శాఖ నుంచి సర్వేయర్ ద్వారా మ్యాప్ పూర్తి వివరాలు రాగానే ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్ హద్దులను వారం రోజుల్లో శాశ్వతంగా ఏర్పాటు చేసేలా కృషి చేస్తున్నట్లు వివరించారు. ట్రెంచ్ తో పాటు ఎఫ్ టీ ఎల్ శాశ్వత పిల్లర్స్ ను ఏర్పాటు చేసి భవిష్యత్ లో చెరువు ఆక్రమణకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఎఫ్ టీ ఎల్ నుంచి 9 మీటర్ల దూరం వరకు బఫర్ జోన్ గా నిర్ధారించనున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్ లలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని వెల్లడించారు.
మాట నిలబెట్టుకున్న కలెక్టర్
ఇరిగేషన్, రెవెన్యూ శాఖలను 10 రోజుల్లో పనులు ప్రారంభించాలని గత బుధవారం కలెక్టర్ ఆదేశాలివ్వడంతో అధికార యంత్రాంగం హుటాహుటిన ఇటిక్యాల పెద్ద చెరువు పై ఫోకస్ పెట్టింది. ఒకవైపు మత్స్యకారులు, చెరువు పరిరక్షణ కమిటీ, సీపీఐ ఏం ఎల్ న్యూడెమోక్రసీ నాయకుల ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి పత్రాలు ఇవ్వడంతో ఇరిగేషన్ అధికారులపై ఒత్తిడి పెరిగింది. నిజానికి, గతంలో కొందరు ఇరిగేషన్ అధికారులు చేసిన పొరపాట్లు నేటి పరిస్థితికి కారణమైనట్టు సమాచారం.
ఏది ఏమైనప్పటికీ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రత్యేక శ్రద్ధతో ఎఫ్ టీ ఎల్ పనులు ప్రారంభమై మరో వారంలో శాశ్వత పరిష్కారం దిశగా ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు కసరత్తు చేస్తుండటం అభినందనీయమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.చెరువు ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్ నిర్ధారణ పనుల్లో తహసీల్దార్ దిలీప్ కుమార్,ఇరిగేషన్ డీ ఈ కుమార్, ఏ ఈ ప్రణీత్, ఆర్ ఐ స్వర్ణలత, సర్వేయర్స్ సైదులు, దినేష్, వర్క్ ఇన్స్పెక్టర్స్ కిషన్, శ్రీనివాస్ లు పాల్గొన్నారు.