20-05-2025 08:10:30 PM
సీఐటీయు ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్ లో నిరసన..
సిఐటియు భద్రాద్రి జిల్లా ఉపాధ్యక్షులు గద్దల శ్రీనివాస్..
మణుగూరు (విజయక్రాంతి): కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని, కార్మికుల పొట్ట కొట్టే 4 కోడ్ లను రద్దు చేయాలని మంగళవారం సీఐటీయు ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో ప్లే కార్డ్స్ తో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సిఐటియు భద్రాద్రి జిల్లా ఉపాధ్యక్షులు గద్దల శ్రీనివాస్ మాట్లాడుతూ... పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చి కార్మికులను బిక్షగాళ్లను చేసే కుట్రలకు బిజెపి ప్రభుత్వం పాల్పడుతున్నదని ఆరోపించారు. వివిధ ప్రభుత్వ రంగ పరిశ్రమలను రైల్వే, విమానాశ్రయలు, సముద్ర ఫోర్ట్ లు కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని ఆయన విమర్శించారు.
విద్యుత్ పంపిణీ వ్యవస్థను ప్రయివేట్ కంపిణీలకు కట్టబెట్టి స్మార్ట్ మీటర్ల పేరు మీదా ప్రజలను దోపిడీ చేయడానికి గేట్లు తెరుస్తున్నారని పేర్కొన్నారు. నూతన విద్యా విధానం పేరుతో చరిత్రను మరుగున పర్చి మతపరమైన అంశాలతో దేశాన్ని నాశనం చేయడానికి పూనుకుంటున్నారని ఆరోపించారు. రాజ్యాంగంలో ప్రజలకు కల్పించిన స్వేచ్చా స్వాతంత్రాలను హరిస్తున్నారని ఆవేదనను వ్యక్తం చేశారు. రాజ్యాంగం స్థానంలో మనుస్మృతి తీసుకురావలనే కుట్రలు చేస్తున్నారని అందుకే జులై 9న జరిగే సమ్మెలో కార్మికవర్గం పెద్దఎత్తున పాల్గొని ప్రజా వ్యతిరేక విదానాలపై కలిసి కట్టుగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు సత్రపల్లి సాంబశివరావు, నైనారపు నాగేశ్వరరావు, రమేష్, బుర్ర సత్యనారాయణ, ఆజి, నరసయ్య, కిషన్ తదితరులు పాల్గొన్నారు.