calender_icon.png 24 December, 2025 | 3:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవగాహన పెరిగింది.. సైబర్ నేరాలు తగ్గాయి

24-12-2025 01:28:00 AM

2025 నేర గణాంకాలు వెల్లడించిన సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి

శేరిలింగంపల్లి,డిసెంబర్ 23(విజయక్రాంతి): సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది సైబర్ నేరాలు గణనీయంగా తగ్గాయని, ప్రజల్లో పెరిగిన అవగాహనే ఇందుకు ప్రధాన కారణమని పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు. 2025 వార్షిక నేర నివేదికను విడుదల చేసిన ఆయన, గత ఏడాదితో పోలిస్తే ఓవరాల్ క్రైమ్ రేట్లో పెద్దగా మార్పు లేదని, ఈ ఏడాది మొత్తం 37,243 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు.

అయితే సైబర్ నేరాలు మాత్రం 35 నుంచి 40 శాతం వరకు తగ్గాయని చెప్పారు.సైబర్ మోసాల్లో బాధితులు కోల్పోయిన డబ్బు గతేడాది రూ.793 కోట్లుండగా, ఈ ఏడాది రూ.440 కోట్లకు తగ్గిందని సీపీ వివరించారు. డిజిటల్ అరెస్ట్కు సంబంధించిన 117 కేసుల్లో రూ.96.76 లక్షలను బాధితులకు తిరిగి ఇప్పించగలిగామని తెలిపారు.మాదక ద్రవ్యాల నియంత్రణలో భాగంగా ఈ ఏడాది 575 ఎన్డీపీఎస్ కేసులు నమోదు చేసి 1,228 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.

నిందితుల నుంచి రూ.16.85 కోట్ల విలువైన 1,524 కిలోల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ అంశానికి వస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు తగ్గాయని, 15,706 కేసులు నమోదు చేసి రూ.239 కోట్ల విలువైన చలాన్లు విధించినట్లు చెప్పారు. బ్లాక్ స్పాట్లపై దృష్టి సారించడంతో రోడ్డు ప్రమాదాలు తగ్గాయని, ఈ ఏడాది ప్రమాదాల్లో 850 మంది మృతి చెందినట్లు పేర్కొన్నారు.

ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు ‘సైబరాబాద్ ట్రాఫిక్ పల్స్’ విధానం, ట్రాఫిక్ మార్షల్స్ను అమలు చేస్తున్నామని తెలిపారు.మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ముమ్మరంగా పనిచేశాయని, డెకాయ్ ఆపరేషన్లలో 3,315 మందిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని సీపీ చెప్పారు. ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 2,298 మంది పిల్లలను రక్షించినట్లు వెల్లడించారు.

మీడియా ప్రశ్నలకు స్పందించిన ఆయన, భూ వివాదాల విషయంలో పోలీసులపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని స్పష్టం చేశారు. సైబరాబాద్ పరిధిలో భూముల విలువ అధికంగా ఉండటంతో సివిల్ వివాదాలు సహజమని, శాంతిభద్రతలకు ముప్పు ఉన్నప్పుడే పోలీసులు జోక్యం చేసుకుంటారని తెలిపారు.