24-12-2025 01:31:25 AM
పాల్గొననున్న ఎంపీ ఈటల రాజేందర్
జవహర్ నగర్, డిసెంబర్ 23 (విజయక్రాంతి): జవహర్ నగర్ లోని డంపింగ్ యార్డ్ సమస్యపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు తీర్పు నేపథ్యంలో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ పోరుబాటకై బుధవారం రాంకీ డంపింగ్ యార్డ్ సందర్శిస్తున్నారని జవహర్ నగర్ పశ్చిమ శాఖ బిజెపి అధ్యక్షులు కమల్ పేర్కొన్నారు. జవహర్ నగర్ జిహెచ్‌ఎంసి చెత్త డంపింగ్ యార్డ్ సమస్యపై బిజెపి తీవ్ర పోరాటం చేస్తున్న విషయం విధితమే.
ఫలితంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు తీర్పు ఇచ్చిందని అయినా కానీ తెలంగాణ ప్రభుత్వం డంపింగ్ యార్డ్ యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం శోచనీయమన్నారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వల్ల జవహర్ నగరే కాక చుట్టుపక్కల ప్రాంతాలైన అహ్మద్ గూడ , కీసర, నాగారం, రాంపల్లి, ఘట్కేసర్ తదితర ప్రాంతాలు ఈ చెత్త సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే రామ్ కి యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం తగదన్నారు.
ఈ డంపింగ్ యార్డ్ సమస్య వల్ల గాలి కలుషితమై పోయిందని, నీరు కూడా కలుషితమై పోయాయని, వాతావరణం, పచ్చని పంట పొలాలు మాయమయ్యాయని డంపింగ్ బాధతో ప్రజలు దీర్ఘకాలిక అనారోగ్యాలకు గురవుతూ స్కిన్ ఎలర్జీలతో బాధపడుతూ నిత్యం నరకం అనుభవిస్తున్నారన్నారు. ఈ డంపింగ్ సమస్య వల్ల జవహర్ నగర్ లో జీవించే పేద ప్రజలు తమ ఆరోగ్య చికిత్సలకై లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతూ అప్పుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాలుష్యం వల్ల చర్మ సమస్యలే కాకుండా మానసిక సమస్యలు తోడై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
ఈ సమస్యలపై బిజెపి పోరుబాట పట్టిందని ఈ కార్యక్రమానికి మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమం మేడ్చల్ జిల్లా రూరల్ బిజెపి అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం డంపింగ్ యార్డ్ బాధితులందరూ పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి రంగుల శంకర్ నేత తదితరులు పాల్గొన్నారు.