30-08-2025 06:22:10 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రాంనాథ్ ఆదేశాల మేరకు తొర్రూరు సబ్ డివిజన్ పరిధిలోని నెల్లికుదురు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో నెల్లికుదురు పోలీస్, షీ టీం, భరోసా మరియు మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లికుదురు ఎస్ఐ రమేష్ బాబు, షీ టీం ఎస్సై సునంద యువత చెడు అలవాట్లకు లోను కాకుండా తమ భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని, అపరిచితుల ఫోన్ కాల్స్‌కి వ్యక్తిగత వివరాలు ఇవ్వకూడదన్నారు.వేధింపులు ఎదురైనప్పుడు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని, 18 ఏళ్ల లోపు వారు వాహనాలు నడపడం చట్ట విరుద్ధమని స్పష్టంచేశారు.
అలాగే విద్యార్థినుల భద్రతే షీ టీం ప్రధాన లక్ష్యం అని, మహిళలు ఎక్కువగా పరిచయమైన వ్యక్తుల నుండే వేధింపులకు గురవుతున్నారని, అలాంటి సందర్భాల్లో ఎటువంటి భయం లేకుండా షీ టీంను సంప్రదించాలని సూచించారు. ఫిర్యాదు దారుల వివరాలు ఎల్లప్పుడూ గోప్యంగా ఉంచబడతాయని చెప్పారు. ఫిర్యాదుల కోసం, అత్యవసర సమయాల్లో 100, షీ టీం వాట్సాప్ నెంబర్: 8712656935, సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ: 1930 చేయాలన్నారు.
విద్యార్థినులు టి సేఫ్ యాప్ వినియోగించడం ద్వారా ప్రయాణాన్ని మరింత సురక్షితంగా చేసుకోవచ్చని, సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని, అనుమానాస్పద లింకులను క్లిక్ చేయరాదని సూచించారు. సైబర్ నేరాలకు గురైనప్పుడు అధైర్యపడకుండా వెంటనే 1930 నెంబర్‌కి ఫిర్యాదు చేయాలని సూచించారు..ఈ సందర్భంగా గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, పోక్సో చట్టం, మహిళా, బాలల రక్షణ చట్టాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు.