calender_icon.png 6 August, 2025 | 1:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో ముందుకు సాగాలి

05-08-2025 10:24:37 PM

చిన్నతనం నుండి దేశభక్తి భావాన్ని పెంపొందించుకోవాలి

 ప్రముఖ న్యాయవాది మల్లు నాగార్జున రెడ్డి

చివ్వెంల,(విజయక్రాంతి): స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో విద్యార్థులు ముందుకు సాగాలని, చిన్నతనం నుండే  దేశభక్తి భావాన్ని పెంపొందించుకోవాలని ప్రముఖ న్యాయవాది మల్లు నాగార్జున రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రం పరిధిలోని దురాజ్ పల్లి మైనార్టీ గురుకుల పాఠశాలలో ఆవాజ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలోదేశ స్వాతంత్రం కోసం పోరాడిన ముస్లిం, మైనార్టీ యోధుల చిత్రపటాలతో రూపొందించిన ఫోటో ఎగ్జిబిషన్ ను మైనార్టీ గురుకుల ప్రిన్సిపల్ వినోద తో కలిసి రిబ్బన్ కట్ చేసి ఫోటో ఎగ్జిబిషన్ ను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భారత దేశ స్వాతంత్ర ఉద్యమంలో ముస్లిం, మైనార్టీలు నిర్వహించిన పాత్ర మరువలేనిది అన్నారు. ఈ దేశ అభివృద్ధికి ముస్లిం మైనార్టీలు చేసిన కృషి గొప్పదన్నారు. వారి పోరాట చరిత్రను విద్యార్థులకు తెలియజేసేందుకు ఆవాజ్ ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించడంఅభినందనీయమన్నారు. భారతదేశ దేశ దాస్య శృంకలాలను బ్రిటిష్ వారి నుండి రక్షించేందుకు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ముస్లింలు పోరాడారని గుర్తు చేశారు.

వేలాదిమంది ముస్లింలు దేశ స్వాతంత్రం కోసం తమ ప్రాణాలను అర్పించి, దేశభక్తిని చాటి చెప్పారని అన్నారు. అలాంటి త్యాగాలను విస్మరించి ముస్లింల యొక్క దేశభక్తిని ప్రశ్నించడం దుర్మార్గమైన చర్యని అన్నారు. ఈ వాస్తవాన్ని ప్రచారం చేసేందుకు స్వాతంత్ర పోరాటంలో ముస్లింల పాత్రను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఆవాజ్ చేసిన కృషిని అభినందిస్తున్నామన్నారు. ఇటీవల విడుదలైన కేరళ స్టోరీ, రజా కార్, హరిహర వీరమల్లు వంటి చిత్రాలు ముస్లిం మైనార్టీలకు వ్యతిరేకంగా వచ్చాయని గుర్తు చేశారు.

అలాంటి చిత్రాలకు కేంద్ర ప్రభుత్వం జాతీయ పురస్కారాలు అందజేసిందని అన్నారు. మైనార్టీ గురుకుల ప్రిన్సిపల్ వినోద మాట్లాడుతూ విద్యార్థులకు చిన్నతనం నుండి దేశభక్తి భావాలను అలవర్చుకోవాలన్నారు. దేశభక్తిని, లౌకిక తత్వాన్ని, సమానత్వాన్ని అర్థం చేసుకోవాలన్నారు. చిన్న వయసులోనే దేశ స్వతంత్ర ఉద్యమ యోధుల చరిత్రను విద్యార్థులకు తెలియజేసిన ఆవాజ్ జిల్లా కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు.