calender_icon.png 30 October, 2025 | 6:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ కేబినెట్‌లోకి అజారుద్దీన్‌.. ఎల్లుండి మంత్రిగా ప్రమాణం

29-10-2025 04:30:43 PM

హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం పిక్స్ అయింది. ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో మూడు స్థానాలు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. అందులో మాజీ టీం ఇండియా ఆటగాడు,  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అజారుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. ఈ మేరకు ఆయన శుక్రవారం (అక్టోబర్ 31) ఉదయం 11 గంటలకు మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇప్పటివరకు కేబినెట్ లో మైనారీ వర్గాలకు చెందిన మంత్రి లేరు. విస్తరణలో తప్పకుండా మైనార్టీ కోటా నుంచి ఒకరికి ఛాన్స్ ఇవ్వాలనే అభిప్రాయాలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అజారుద్దీన్‌ పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. 

ఇటీవల గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా అజారుద్దీన్ ను సూచించిన ప్రభుత్వం ఆయన్ని ఎమ్మెల్సీగా చేసి హైదరాబాద్ నుంచి మంత్రివర్గంలోకి తీసుకునేందుకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం తెలంగాణలో జరుగనున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికలో కూడా అజారుద్దీన్‌ టికెట్ ను ఆశించారు. కానీ చివరికి కాంగ్రెస్ అధిష్ఠానం నవీన్ యాదవ్ కు టికెట్ ఖరారు చేసింది. దీంతో ఆయనకు రాష్ట్ర కేబినెట్ లో చోటు కల్సిస్తామని హామీ ఇవ్వడంతో వెనక్కి తగినట్లు రాజకీయ వర్గాలు తెలిపాయి.

అజారుద్దీన్‌ రాజకీయ ప్రవేశం:

క్రికెట్ ముగిసిన తర్వాత మొహమ్మద్ అజారుద్దీన్‌ రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసి 2009లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009లో ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ విజయం సాధించారు. ఆ తర్వాత 2014 లోక్‌సభ ఎన్నికల్లో రాజస్థాన్ లోని టన్-సవాయ్ మాధోపూర్ నుంచి పోటీ చేసిన అజారుద్దీన్ ఓటమి చావిచూశారు. ఇక, 2018లో అజారుద్దీన్ టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఇవ్వలేదు. 2019లో ఆయన హెచ్సీఏ అధ్యక్షుడిగాఎన్నికయ్యారు. 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఓడిపోయారు.

టీమిండియా కెప్టెన్‌గా

1984 డిసెంబర్ 31న కోల్‌కతాలో ఇంగ్లాండ్‌పై జరిగిన టెస్ట్ మ్యాచ్‌తో అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించారు. అజారుద్దీన్ తన తొలి మూడు టెస్ట్ మ్యాచ్‌లలో వరుసగా సెంచరీలు (110, 105, 122) సాధించి ప్రపంచ రికార్డు సృష్టించారు. తర్వాత 1989లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన అజారుద్దీన్ 1990లలో చాలా కాలం జట్టును నడిపించారు. అత్యధిక వన్డే మ్యాచ్‌లకు (174) కెప్టెన్సీ వహించిన భారత కెప్టెన్లలో ఒకరు. మూడు ప్రపంచ కప్‌లలో (1992, 1996, 1999) కెప్టెన్‌గా వ్యవహరించారు.

టెస్టులు: 99 మ్యాచ్‌లు ఆడి 6,215 పరుగులు (22 సెంచరీలు) చేశాడు.

వన్డేలు (ODI): 334 మ్యాచ్‌లు ఆడి 9,378 పరుగులు (7 సెంచరీలు) తీశాడు.

2000 సంవత్సరంలో, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొని బీసీసీఐ ద్వారా జీవితకాల నిషేధానికి గురయ్యారు. అయితే, 2012లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ నిషేధాన్ని చట్టవిరుద్ధమని పేర్కొంటూ ఎత్తివేసింది.

అవార్డులు: 1986లో అర్జున అవార్డు, 1988లో పద్మశ్రీ అందుకున్నారు.