calender_icon.png 3 November, 2025 | 6:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నింగిలోకి దూసుకెళ్లిన బాహుబలి రాకెట్

03-11-2025 02:33:37 AM

  1. ఇస్రో సీఎంఎస్ ప్రయోగం గ్రాండ్ సక్సెస్
  2. 16 నిమిషాల తర్వాత ‘జీటీవో’ స్థిరపడిన ఉపగ్రహం
  3. 4,410 కిలోల బరువు ఉండే ఉపగ్రహ ప్రయోగం చరిత్రలో ఇదే తొలిసారి
  4. భారత నావికా దళానికి కమ్యూనికేషన్ సేవలు
  5. సముద్ర జలాలపై నిఘా మరింత పటిష్టం

శ్రీహరికోట/ న్యూఢిల్లీ, నవంబర్ 2: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విజయాల పరంపరలో మరో విజయం నమోదైంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఆదివారం సాయంత్రం సరిగ్గా 5:26 గంటలకు భారీ కమ్యూనికేషన్‌కు సంబంధించి భారీ ఉపగ్రహం ‘సీఎంఎస్-03’ను ప్రయోగించి సక్సెస్ అయింది. ఉపగ్రహం నింగిలోకి దూసుకెళ్లి దాదాపు 16 నిమిషాల తరువాత  జియో -సింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ (జీటీవో)లోకి వెళ్లి స్థిరపడింది.

అలాగే 4,410 కిలోల బరువు ఉండే రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం మరో రికార్డు. ఇప్పటివరకు ఇస్రో ప్రయోగించిన అత్యంత బరువైనది కావడం గమనార్హం. రాకెట్ తయారీగా పూర్తిగా దేశీయంగా జరగడం విశేషం. ‘సీఎంఎస్-03’ ఉపగ్రహం ద్వారా భారత సమాచార వ్యవస్థ మరింత మెరుగుపడనుంది. సముద్ర వాతావరణ పరిస్థితులను మరింత మెరుగ్గా తెలుసుకునేందుకు అవకాశం ఏర్పడింది. ఈ సమాచారం భారత నావికా దళానికి ఎంతో కీలకం.

ఉపగ్రహం ద్వారా సముద్ర జలాల్లో మోహరించిన యుద్ధనౌకలు, జలాంతర్గాములు, భూనియంత్రణ కేంద్రాల నుంచి కమ్యూనికేషన్ సమాచారం సులభంగా నావికా దళానికి అందుతుంది. ఉపగ్రహం భారత తీరం నుంచి 2వేల కి.మీ వరకు విస్తరించిన సముద్ర జలాలకు సంబంధించిన సమాచారం ఇవ్వగలదు. అలాగే ఉపగ్రహం అందించే సమాచారంతో హిందూ మహాసముద్రంలో చైనా నావిక దళ కదలికలను పసిగట్టవచ్చు. సముద్ర జలాల్లో భవిష్యత్తులో చైనా వేసే ఎత్తుగడలను సులభంగా తిప్పికొట్టవచ్చు.

ఇస్రో 2013 నుంచి అలాంటి సేవలు అందిస్తున్న జీశాట్ స్థానంలో సీఎంఎస్03ని తాజాగా ప్రయోగించింది. ప్రయోగం విజయవంతంపై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ఇస్రో శాస్త్రవేత్తల కృషికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. మరోవైపు ఇస్రో ఈ ఆర్థిక సంవత్సరంలో ఏడు ప్రయోగాలను లక్ష్యంగా పెట్టుకుంది. డిసెంబర్ రెండోవారంలో మరో ప్రయోగం ఉండే అవకాశం ఉంది.

  1. మరో మైలురాయి
  2. చైర్మన్ డాక్టర్ వీ నారాయణన్ 

సీఎంఎస్03 ప్రయోగం భారత్‌కు కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చిందని ఇస్రో చైర్మన్ డాక్టర్ వీ నారాయణన్ పేర్కొన్నారు. ఉపగ్రహ ప్రయోగం కోసం రాకెట్ సామర్థ్యాన్ని, పేలోడ్ మోసే శక్తిని పెంచాల్సి వచ్చిందని వెల్లడించారు. ఉపగ్రహం నిర్దేశిత కక్ష్యలో స్థిరపడటం తనతోపాటు శాస్త్రవేత్తలో కొత్త ఉత్సాహాన్ని నింపిందన్నారు. ఈ ప్రయోగం ‘ఆత్మనిర్భర్ భారత్’కు మైలురాయి లాంటిదని అభివర్ణించారు. ఉపగ్రహం భారత నావికా దళానికి విశిష్ట సేవలు అందిస్తుందని పేర్కొన్నారు. సముద్ర జలాలపై నిఘా పటిష్టమవుతుందని వెల్లడించారు.