03-11-2025 05:42:08 PM
కొల్చారం ఎంపీవో అనుచిత వ్యాఖ్యలు
ఎంపీవోపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు
కొల్చారం: కోనాపూర్ గ్రామస్తులు గాడిదలు... వారిని మేపడానికే గ్రామానికి వచ్చా అంటూ కొల్చారం ఎంపీఓ కృష్ణవేణి గ్రామస్తులపై ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ సంఘటన సోమవారం కొల్చారం మండలం కోనాపూర్ లో జరిగింది. గ్రామంలో పంచాయతీ కార్యదర్శి ప్రత్యేక అధికారుల నిర్లక్ష్యం మూలంగా పారిశుద్ధ్య సమస్యతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూడు నెలలుగా పంచాయతీ కార్యదర్శి గ్రామానికి రావడం లేదు. గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులు పనిచేయడం లేదు.. దీంతో గ్రామంలో మురుగు కాలువలు చెత్తతో నిండిపోయి రోడ్లపై మురుగునీరు ప్రవహిస్తూ ఇండ్లలోకి మురుగునీరు వస్తుంది. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గ్రామంలో పారిశుద్ధ్య సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కరించకపోవడంతో సోమవారం గ్రామస్తులు పంచాయతీ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. విషయం తెలిసిన ఎంపీడీవో రఫిక్ ఉనిస్తా బేగం గ్రామానికి వెళ్లి సమస్య తెలుసుకోవాలని సమస్య పరిష్కరించాలని ఎంపిఓ కృష్ణవేణిని ఆదేశించారు. దీంతో గ్రామానికి ఎంపీఓ కృష్ణవేణి వచ్చేసరికి మధ్యాహ్నం రెండు గంటలు అయింది. అప్పటికి పంచాయతీ కార్యాలయాన్ని సిబ్బంది కానీ పంచాయతీ సెక్రెటరీ గానీ తెరవలేదు. పంచాయతీ కార్యదర్శి మహేష్ గ్రామస్తులకు గానీ అధికారులకు గానీ ఫోన్లో అందుబాటులో లేరు. ఎవరికి అందుబాటులో లేని సెక్రటరీతో ఎలా పని చేయిస్తారని గ్రామస్తులు ఎంపీఓను నిలదీయడంతో గ్రామస్తులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్రామస్తులు గాడిదలు వాటిని వేపడానికి నేను గ్రామానికి వచ్చా అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో గ్రామస్తులు ఎంపీఓపై తిరగబడ్డారు. సంగాయిపేట, తుక్కాపూర్ పంచాయతీ కార్యదర్శులు సదాశివుడు, ప్రశాంత్ లు జోక్యం చేసుకొని గ్రామస్తులను శాంతింపజేశారు. దీంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. వారం రోజుల్లో గ్రామంలో అన్ని సమస్యలు పరిష్కారమయ్యేలా చూస్తామని గ్రామస్తులకు అధికారులు హామీ ఇచ్చారు. అనంతరం గ్రామస్తులతో కలిసి ఎంపీఓ కృష్ణవేణి, కార్యదర్శులు గ్రామంలో తిరిగి గ్రామంలో సమస్యలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రంగంపేట సహకార సంఘం ఉపాధ్యక్షులు మోత్కు మల్లేశం, మాజీ సర్పంచ్ రమేష్, బి ఆర్ఎస్ నాయకులు బండి ఆంజనేయులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండి మల్లేశం గ్రామస్తులు వినోద్ తదితరులు పాల్గొన్నారు.