calender_icon.png 12 November, 2025 | 2:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెప్టెంబర్‌లో ‘బచ్చలమల్లి’

01-07-2024 12:05:00 AM

నేటితరం కథానాయకుల్లో అతి తక్కువ కాలంలో యాభై చిత్రాలు పూర్తి చేసిన నరేశ్, తన చిత్రాల్లో వైవిధ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కొంత విరామం తర్వాత మేలో విడుదలైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ చిత్రం ద్వారా మండుటెండల్లో ప్రేక్షకులను నవ్వించడానికి వచ్చిన ఆయన, త్వరలో తెరమీదికి రానున్న ‘బచ్చలమల్లి’ చిత్రంతో శక్తివంతమైన మాస్ పాత్రలో అలరించనున్నారు.  నరేశ్ కథానాయకుడిగా సుబ్బు మంగదేవి (సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్) దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘బచ్చలమల్లి’. ఆదివారం నరేశ్ పుట్టినరోజ సందర్భంగా సినిమాలో ఆయన పాత్రని పరిచయం చేస్తూ ప్రత్యేక గ్లింప్స్‌ను విడుదల చేశారు మేకర్స్.

ఇందులో పూర్తి మాస్ లుక్‌లో కనపడిన నరేశ్ “ఎవడి కోసం తగ్గాలి..? ఎందుకు తగ్గాలి?” అంటూ ఓ బ్యాచ్ తలకాయలు పగులకొట్టేశారు. ఉన్నట్టుండి నరేశ్ ఎందుకింత క్రూరంగా మారిపోయారు అనుకుంటున్నారా..? దానికి సమాధానం తెలియాలంటే మరో రెండు నెలలు ఆగాల్సిందే. హాస్య మూవీస్ పతాకంపై ‘సామజవరగమన’, ‘ఊరు పేరు భైరవకోన’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన రాజేష్ దండా, బాలాజీ గుత్తా తమ తాజా చిత్రమైన ‘బచ్చలమల్లి’ని సెప్టెంబరులో విడుదల చేయనున్నట్టు తెలిపారు.

అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రోహిణి, రావు రమేష్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరి తేజ, ప్రవీణ్, వైవా హర్ష తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. విశాల్ చంద్రశేఖర్ స్వరకర్తగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి ఛాయాగ్రహణం: రిచర్డ్ ఎం నాథన్, కూర్పు:  ఛోటా కె ప్రసాద్, కళ: బ్రహ్మ కడలి.

63వ చిత్రం ప్రకటన: నరేశ్ జన్మదిన సందర్భంగా ఆదివారం నాడు ఆయన కొత్త సినిమాకి సంబంధించిన ప్రకటన వెలువడింది. సితార ఎంటర్ టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సంస్థల్లో రూపొందనున్న ఈ సినిమాకి మెహర్ తేజ్ దర్శకత్వం వహించనున్నారు. త్వరలో మరిన్ని వివరాలు తెలియనున్నాయి.